LOADING...
Union Budget 2026: సుదీర్ఘ ప్రసంగాల నుంచి సంక్షిప్త బడ్జెట్ల వరకు: కేంద్ర బడ్జెట్ చరిత్రలో రికార్డులు
కేంద్ర బడ్జెట్ చరిత్రలో రికార్డులు

Union Budget 2026: సుదీర్ఘ ప్రసంగాల నుంచి సంక్షిప్త బడ్జెట్ల వరకు: కేంద్ర బడ్జెట్ చరిత్రలో రికార్డులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2026
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర బడ్జెట్ 2026లో ఏ అంశాలు ఉంటాయన్న దానిపై దేశ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పించే విధానం ప్రధాని నరేంద్ర మోదీ పాలనలోనే ప్రారంభమైంది. అయితే, ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. సమావేశాల మొదటి దశ జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుండగా, రెండో దశ మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగనుంది.

వివరాలు 

కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన కీలక రికార్డులు

నిర్మలా సీతారామన్ తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఘనత సాధించిన తొలి ఆర్థిక మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ పేరిట ఈ రికార్డు ఉండేది. సాధారణంగా కేంద్ర బడ్జెట్ ప్రసంగం 90 నిమిషాల నుంచి 120 నిమిషాల మధ్య ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ ప్రసంగాలు అనూహ్యంగా ఎక్కువసేపు కొనసాగిన ఉదాహరణలు ఉన్నాయి.

వివరాలు 

కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన కీలక రికార్డులు

2020-21 ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగం అత్యంత సుదీర్ఘంగా నమోదైంది. ఈ ప్రసంగం 2 గంటల 42 నిమిషాలు (మొత్తం 162 నిమిషాలు) సాగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ప్రసంగం మధ్యాహ్నం 1.40 గంటల వరకు కొనసాగింది. ఎల్‌ఐసీ ఐపీఓ,ఆదాయపు పన్ను విధానంలో కీలక మార్పులు వంటి అంశాలు ఇందులో చోటు చేసుకున్నాయి. అయితే, సుదీర్ఘ ప్రసంగం కారణంగా ఆమె అస్వస్థతకు గురికావడంతో, చివరి రెండు పేరాలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చదివి వినిపించారు. పదాల పరంగా చూస్తే, అత్యంత పొడవైన బడ్జెట్ ప్రసంగం రికార్డు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరిట ఉంది.

Advertisement

వివరాలు 

కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన కీలక రికార్డులు

ఆయన ఆర్థిక మంత్రిగా 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మొత్తం 18,700 పదాలు ఉన్నాయి. ఇది భారత ఆర్థిక చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది. లైసెన్స్ రాజ్ విధానానికి ముగింపు పలికి, ఆర్థిక సరళీకరణ దిశగా దేశాన్ని నడిపించిన బడ్జెట్‌గా దీనికి గుర్తింపు ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రసంగం కూడా సుదీర్ఘ జాబితాలో నిలిచింది. ఈ ప్రసంగం 2 గంటల 17 నిమిషాల పాటు సాగి, రెండో అత్యంత పొడవైన బడ్జెట్‌గా నిలిచింది. ఆదాయపు పన్ను రిటర్న్‌లను ముందుగానే దాఖలు చేసే అవకాశం, ఎంఎస్ఎంఈ రంగానికి మేలు చేసే చర్యలు ఈ బడ్జెట్‌లో ప్రకటించారు.

Advertisement

వివరాలు 

కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన కీలక రికార్డులు

2003-04లో అప్పటి బీజేపీ ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ 2 గంటల 13 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను రిటర్న్‌లకు ఈ-ఫైలింగ్ విధానాన్ని ప్రకటించడంతో పాటు, కొన్ని వస్తువులపై ఎక్సైజ్,కస్టమ్స్ సుంకాలను తగ్గించారు. అలాగే, 2014-15 ఆర్థిక సంవత్సరానికి అరుణ్ జైట్లీ చేసిన బడ్జెట్ ప్రసంగం 2 గంటల 10 నిమిషాలు కొనసాగింది. ఈ బడ్జెట్‌లో అదనపు ఎయిమ్స్ సంస్థల ఏర్పాటు, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతానికి పెంపు, పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచడం వంటి కీలక ప్రకటనలు చేశారు.

వివరాలు 

అత్యంత సంక్షిప్త బడ్జెట్ ప్రసంగాలు

ఇప్పటివరకు నమోదైన అత్యంత చిన్న బడ్జెట్ ప్రసంగం 1977-78 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా జరిగింది. అప్పటి ఆర్థిక మంత్రి హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్ సుమారు 800 పదాలతోనే బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఇటీవలి కాలంలో, ఫిబ్రవరి 2024లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రసంగం కూడా అత్యంత సంక్షిప్తంగా నిలిచింది. ఈ సందర్భంగా ఆమె కేవలం 56 నిమిషాల పాటు మాత్రమే సభను ఉద్దేశించి మాట్లాడారు.

Advertisement