
Aadhaar enrolment centre: ఒక్క క్లిక్‌తో మీ ప్రాంతంలోని ఆధార్ కేంద్రాన్ని ఇలా కనుగొండిలా..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు కీలకమైన పత్రంగా మారింది. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, స్కాలర్షిప్‌లు, సబ్సిడీలు వంటి ఎన్నో అవసరాల కోసం ఆధార్ అనివార్యం అయిపోయింది. అందుకే దీన్ని సరిగ్గా అప్‌డేట్ చేసుకుంటూ ఉండటం చాలా అవసరం. ఆధార్‌లో ఏదైనా తప్పిదం ఉన్నప్పుడు, లేదా కొత్త వివరాలు చేర్చాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. అయితే సమస్య ఏమిటంటే, అలాంటి కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? వాటి సమాచారం తెలుసుకోవడమే చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా ఇటీవలే నగరాలకు వలస వచ్చినవారికి, లేక నివాసం మారిన వారికి అతి అవసరమైన విషయం ఇది.
వివరాలు
UIDAI - ISRO భాగస్వామ్యంలో భువన్ ఆధార్!
ఈ అవసరాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం "భువన్ పోర్టల్" అనే టూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని సహాయంతో మన ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI),ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) సంయుక్తంగా "భువన్ ఆధార్" (Bhuvan Aadhaar) అనే పోర్టల్‌ను రూపొందించాయి. దీని ద్వారా ఆధార్ హోల్డర్లు మూడు ముఖ్యమైన ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు: తమ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రాల లొకేషన్‌ను తెలుసుకోవచ్చు. ఆ కేంద్రాలకు వెళ్లే మార్గం (రూట్ మ్యాప్)ను చూడవచ్చు. ఆయా కేంద్రాల్లో మీకు కావాల్సిన సేవలు అందుబాటులో ఉన్నాయా? లేదా? అన్న దానిపై స్పష్టత పొందవచ్చు.
వివరాలు
భువన్ ఆధార్ పోర్టల్ వాడే విధానం ఇలా…
మీరు ఎంత దూరం లోపల ఆధార్ కేంద్రం కావాలో కూడా ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఈ పోర్టల్ అందిస్తోంది. ముందుగా భువన్ ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి. స్క్రీన్ ఎడమవైపున నాలుగు డ్రాప్‌డౌన్ ఆప్షన్లు కనిపిస్తాయి. "Centres Nearby" అనే ఎంపికను ఎంచుకుంటే, మీ ప్రస్తుత స్థానం ఆధారంగా దగ్గరలోని ఆధార్ కేంద్రాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మీకు ఇప్పటికే ఏదైనా ఆధార్ సేవా కేంద్రం పేరు తెలిసి ఉంటే "Search by Aadhaar Seva Kendra" అనే ఆప్షన్ ద్వారా నేరుగా ఆ కేంద్రాన్ని సెర్చ్ చేయవచ్చు. పిన్‌కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా కూడా మీ ప్రాంతానికి దగ్గరలోని కేంద్రాల వివరాలను తెలుసుకోవచ్చు.
వివరాలు
భువన్ ఆధార్ పోర్టల్ వాడే విధానం ఇలా…
రాష్ట్రం, జిల్లా, మండల స్థాయిలో వివరాలను ఎంటర్ చేయడం ద్వారా పూర్తిస్థాయిలో ఆధార్ కేంద్రాల లిస్ట్‌ను పొందవచ్చు. "Tools" అనే సెక్షన్‌లోకి వెళ్లి, మ్యాప్ సాయంతో మీకు అవసరమైన ఆధార్ కేంద్రానికి దారి చూసుకోవచ్చు.