Hyundai IPO: హ్యుందాయ్ మోటార్ IPO.. 27,870 కోట్ల సమీకరణకు రంగం సిద్ధం
హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ అక్టోబర్ 15 నుంచి కానుంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ ప్రముఖ కార్ల తయారీ సంస్థ తన ప్రతిష్టాత్మక మొదటి పబ్లిక్ ఆఫర్‌తో ఎల్‌ఐసీని దాటి, భారతదేశంలో అతిపెద్ద ఐపీఓగా నిలవనున్నట్లు స్పష్టం చేసింది. ఒక్కో షేరుకు రూ.1865-1960 ధరల శ్రేణిని నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా గరిష్ఠంగా రూ. 27,870 కోట్లు సమీకరించాలని హ్యుందాయ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్‌ఐసీ ఐపీఓ రూ. 21,000 కోట్లను సమీకరించగా, ఈ కొత్త ఐపీఓ దాన్ని అధిగమించనుంది. హ్యుందాయ్ ఐపీఓ అక్టోబర్ 15న ప్రారంభమై 17న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం అక్టోబర్ 14న సబ్‌స్క్రిప్షన్ విండో తెరుచుకోనుంది. మొత్తం 14,21,94,700 ఈక్విటీ షేర్లను కంపెనీ ప్రమోటర్లు విక్రయించనున్నారు.
ఒక లాట్ అంటే ఏడు షేర్లు
కానీ కొత్తగా షేర్లను జారీ చేయడం లేదు. మార్కెట్ విలువ రూ.1.6 లక్షల కోట్లుగా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ అంటే ఏడు షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ఖరీదు రూ. 13,720గా ఉంటుంది. గరిష్ఠంగా 14 లాట్లు కొనుగోలు చేయవచ్చు. హ్యుందాయ్ 1996 నుండి భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచింది. 13 మోడళ్లను విక్రయిస్తున్న ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 1366 సేల్స్ పాయింట్లు, 1550 సర్వీసు పాయింట్లు ఉన్నాయి.
ఐపీఓ ముఖ్యాంశాలు ఇవే
సబ్‌స్క్రిప్షన్ తేదీలు : అక్టోబర్ 15-17 ధరల శ్రేణి : రూ.1865-1960 లాట్ సైజ్ : 7 షేర్లు క్యూఐబీల వాటా : 50% రిటైల్ ఇన్వెస్టర్ల వాటా : 35% ఎన్‌ఐఐ కోటా : 15%