IMF MD: 2025లో భారత ఆర్థిక వృద్ధి బలహీనపడొచ్చు.. ఐఎంఎఫ్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
2025లో భారత ఆర్థికవ్యవస్థ కొంత బలహీనపడే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎండీ క్రిస్టాలినా జార్జివా వ్యాఖ్యానించారు.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా అనుసరించే వాణిజ్య విధానాల ఆధారంగా కొంతమేరకు అనిశ్చితి నెలకొనవచ్చని ఆమె శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.
ప్రస్తుతం స్థిరమైన ప్రపంచ వృద్ధి కొనసాగుతున్నా భారత్ ఆర్థికవ్యవస్థ 2025లో కొంచెం బలహీనపడే అవకాశాలు ఉన్నాయని జార్జివా అభిప్రాయపడ్డారు.
అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆమె వెల్లడించలేదు. ఆర్థిక వృద్ధిలో అమెరికా కాస్త మెరుగ్గా ఉంటుందని, యూరోపియన్ యూనియన్ ప్రస్తుతం ఉన్న స్థాయికే పరిమితం కావచ్చని ఆమె అన్నారు.
భారత్ కొంత బలహీనపడుతుందని, బ్రెజిల్ అధిక ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని అంచనా వేశారు.
Details
చైనాలో కూడా ద్రవ్యోల్బణ ఒత్తిడి
ఇదే సమయంలో, ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్న చైనాలో కూడా ద్రవ్యోల్బణ ఒత్తిడి, దేశీయ డిమాండ్, ఇతర సవాళ్లు కొనసాగవచ్చని జార్జివా అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది ఆర్థిక విధానాలు చాలా అనిశ్చితంగా ఉండే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ఎండీ అంచనా వేశారు.
ముఖ్యంగా, అమెరికా తీసుకొనే విధానపరమైన చర్యలు, సుంకాలు, పన్నులపై నిర్ణయాలు, నియంత్రణ సడలింపులు వంటి అంశాలపై ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికో వంటి దేశాలపై అదనపు టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు.
ఈ చర్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని జార్జివా తెలిపారు.