Page Loader
JP morgan: ట్రంప్‌ సుంకాల ప్రభావం.. ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం
ట్రంప్‌ సుంకాల ప్రభావం.. ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం

JP morgan: ట్రంప్‌ సుంకాల ప్రభావం.. ఉద్యోగాలు గల్లంతయ్యే ప్రమాదం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 05, 2025
01:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకుంటున్న ఆర్థిక విధానాలు, ముఖ్యంగా ఇతర దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలు.. ఈ ఏడాదిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశాన్ని పెంచినట్టు జేపీ మోర్గాన్‌ (JP Morgan) అంచనా వేసింది. ఇంతకు ముందు 40 శాతంగా ఉన్న ఈ మాంద్య అవకాశాలు ప్రస్తుతం 60 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. ఈ పరిణామాలు దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ సీఈవో మైఖేల్ ఫెరోలి స్పష్టం చేశారు. మాంద్యం వల్ల నిరుద్యోగ రేటు 5.3 శాతానికి పెరిగే అవకాశముందని తెలిపారు. దీనివల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని హెచ్చరించారు. ట్రంప్‌ విధిస్తున్న అధిక సుంకాలే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.

Details

ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం

యూఎస్‌ ఆర్థికవేత్త జోనాథన్ పింగిల్ ప్రకారం.. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులు 20 శాతం కన్నా ఎక్కువగా పడిపోవచ్చని తెలిపారు. రాబోయే త్రైమాసికాల్లో దిగుమతుల స్థాయి 1986కు ముందు స్థాయికి చేరే అవకాశముందని అన్నారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ సైతం ట్రంప్‌ విధిస్తున్న సుంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించారు. జేపీ మోర్గాన్‌తో పాటు బార్క్లేస్‌, బోఫా గ్లోబల్ రీసెర్చ్‌, డ్యూష్ బ్యాంక్‌, యూబీఎస్‌ గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్‌ వంటి ప్రముఖ ఆర్థిక పరిశోధనా సంస్థలు కూడా ట్రంప్‌ విధిస్తున్న తాజా టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థను పతన దిశగా నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.

Details

స్టాక్ మార్కెట్లు పతనం

ప్రపంచ దేశాలపై ట్రంప్‌ విధిస్తున్న సుంకాల విషయానికి వస్తే.. భారత్‌పై 27 శాతం, వియత్నాం‌పై 46 శాతం, ఇజ్రాయెల్‌పై 17 శాతం టారిఫ్‌లు విధించారు. అమెరికా మార్కెట్‌లో ఉత్పత్తులను విక్రయించాలంటే కనీసం 10 శాతం సుంకం చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ టారిఫ్‌లలో మొదటి విడతగా 10 శాతం సుంకం ఏప్రిల్‌ 5 నుంచి, మిగిలిన 17 శాతం ఏప్రిల్‌ 10 నుంచి అమల్లోకి రానుందని తెలుస్తోంది. ఈ ప్రకటనలతో పాటు ట్రంప్‌ టారిఫ్‌ పాలసీల ప్రభావంతో స్టాక్ మార్కెట్ భారీగా పతనమయ్యాయి. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లు కుదేలవుతున్నాయి.