Amazon India: దీపావళి విక్రయంలో, ప్రీమియం ఉత్పత్తులదే ఆధిపత్యం
ఈ పండగ సీజన్‌లో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమ్మకాలలో విశేషమైన వృద్ధి నమోదైంది. దీపావళి సందర్భంగా నిర్వహించిన సేల్‌లో టెలివిజన్లు, స్మార్ట్‌ఫోన్లు సహా ప్రీమియం ఉత్పత్తులకు గణనీయమైన డిమాండ్ పెరిగిందని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ శ్రీవాస్తవ తెలిపారు. ఆపిల్ ఐప్యాడ్ అమ్మకాలు పది రెట్లు పెరగగా, శాంసంగ్ ట్యాబ్లెట్ల విక్రయాలు ఐదు రెట్లు పెరిగినట్లు వివరించారు.
లార్జ్ స్క్రీన్ టీవీల వాటా 30 శాతం
పీటీఐతో మాట్లాడుతూ, ప్రీమియం ఉత్పత్తులపై ప్రజల ఆసక్తి పెరుగుతోందని శ్రీవాస్తవ తెలిపారు. టెలివిజన్లు, ఫ్యాషన్, గేమింగ్ ల్యాప్‌ట్యాప్‌లు, గృహోపకరణాల వంటి విభాగాల్లోనూ ప్రీమియం ఉత్పత్తులకే ఎక్కువ ఆదరణ ఉందని అన్నారు. ఈ విక్రయాలు పెద్ద నగరాలకే పరిమితం కాలేదని, మొత్తం అమ్మకాలలో లార్జ్ స్క్రీన్ టీవీల వాటా 30 శాతం ఉందని, ఈ విభాగంలో ఏడాది ప్రాతిపదికన 10 రెట్లు వృద్ధి నమోదైందని చెప్పారు. అదేవిధంగా, ట్యాబ్లెట్ల విక్రయాల్లో ఆపిల్ కంపెనీ పది రెట్లు వృద్ధిని సాధించగా, శాంసంగ్ ట్యాబ్లెట్లు ఐదు రెట్లు పెరిగాయి.
అమ్మకాల్లో 20 శాతం వృద్ధి
రిఫ్రిజిరేటర్లు, ఏసీల అమ్మకాల్లో వార్షిక ప్రాతిపదికన 30 శాతం వృద్ధి నమోదైంది. వాచ్‌లు, సౌందర్య ఉత్పత్తులు, నగలు, హ్యాండ్ బ్యాగ్స్ వంటి విభాగాల్లో విక్రయాలు 400 శాతం పెరిగాయి. ఏడాది క్రితం పండగ సేల్‌లో అమ్మిన ఉత్పత్తులతో పోలిస్తే ఈసారి అమ్మకాల్లో 20 శాతం వృద్ధి నమోదైందని అమెజాన్ వెల్లడించింది. ఈసారి ఫెస్టివల్ సేల్‌లో అమెజాన్ ప్లాట్‌ఫామ్‌ను 140 కోట్ల మంది యూజర్లు సందర్శించారు. వీరిలో 85 శాతం కంటే ఎక్కువ మంది మెట్రో నగరాల నుండి కాకుండా నాన్-మెట్రో నగరాల నుండి వచ్చిన వారేనని చెప్పడం గమనార్హం. పండగ సేల్‌లో ప్రైమ్ సభ్యుల్లో 70 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాలకు చెందిన వారేనని అమెజాన్ తన ప్రకటనలో వెల్లడించింది.