Page Loader
Income tax: అందుబాటులోకి ITR-2 ఆన్‌లైన్‌ యుటిలిటీ
అందుబాటులోకి ITR-2 ఆన్‌లైన్‌ యుటిలిటీ

Income tax: అందుబాటులోకి ITR-2 ఆన్‌లైన్‌ యుటిలిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 18, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

2025-26 మదింపు సంవత్సరం (ఆసెస్‌మెంట్ ఇయర్‌) కోసం ఆదాయపు పన్ను రిటర్నులు ఆన్‌లైన్‌లో దాఖలు చేయడానికి ఐటీఆర్‌-2 (ITR-2) ఫారం‌ను ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చింది. గత ఆర్థిక సంవత్సరానికి మూలధన లాభాలు ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUF) ఈ ఐటీఆర్‌-2 ఫారం ఉపయోగించి తమ పన్ను రిటర్నులు దాఖలు చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ తమ ఎక్స్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేస్తూ, పన్ను చెల్లింపుదారులు ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌లో ప్రీ-ఫిల్ల్డ్‌ డేటాను ఉపయోగించుకుని సులభంగా ఆన్‌లైన్‌లో రిటర్నులు దాఖలు చేయొచ్చని పేర్కొంది. ఇక గత నెలలోనే ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్‌-1, ఐటీఆర్‌-4 ఫారాల ఆన్‌లైన్‌ యుటిలిటీని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

వివరాలు 

సెప్టెంబర్‌ 15 వరకు పన్ను రిటర్నుల ఫైలింగ్‌

వార్షిక ఆదాయం రూ.50 లక్షల లోపే ఉన్న వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు(హెచ్‌యూఎఫ్‌), ఆడిట్‌ అవసరం లేని చిన్న వ్యాపార సంస్థలు ఐటీఆర్‌-1 లేదా ఐటీఆర్‌-4 ఫారాల ద్వారా పన్ను రిటర్నులు దాఖలు చేయవచ్చు. అలాగే,లిస్టెడ్‌ ఈక్విటీ షేర్ల నుంచి గరిష్టంగా రూ.1.25లక్షల వరకు దీర్ఘకాలిక మూలధన లాభాలు పొందిన వ్యక్తులు,సంస్థలు కూడా ఈ ఫారాలను ఉపయోగించుకోవచ్చు. అయితే,ఇతర మూలధన లాభాలు ఉన్నవారు కానీ,వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే ఆదాయం లేనివారు ఐటీఆర్‌-2 ఫారం ఉపయోగించి తప్పనిసరిగా పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను రిటర్నుల ఫైలింగ్‌ గడువు విషయానికి వస్తే,గతంలో జూలై 31 వరకు నిర్ణయించిన చివరి తేదీని ప్రస్తుతం సెప్టెంబర్‌ 15 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.