China: చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి చైనా కంపెనీలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను ఎత్తివేసే అంశాన్ని ఆర్థిక శాఖ గంభీరంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు నేరుగా బిడ్డింగ్‌లో పాల్గొనకుండా చైనా సంస్థలపై విధించిన పరిమితులను సడలించాలనే దిశగా చర్చలు సాగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2020లో చైనా కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే,ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చైనా పర్యటన అనంతరం, రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పలు కీలక ప్రాజెక్టులు ఆలస్యమవుతున్న పరిస్థితిపై ఆర్థిక శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం.
వివరాలు
కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టుల మొత్తం విలువ సుమారు 700 నుంచి 750బిలియన్ డాలర్లు
ఐదేళ్ల క్రితం అమలులోకి తెచ్చిన ఆంక్షలను తొలగించడం ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి. చైనా కంపెనీలకు అవకాశం లేకుండా ఉన్న కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టుల మొత్తం విలువ సుమారు 700 నుంచి 750బిలియన్ డాలర్ల వరకు, అంటే భారత కరెన్సీలో రూ.63 నుంచి రూ.67.5లక్షలకోట్ల మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) వద్దనే ఉందని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉండగా, భారత ఆంక్షల కారణంగా 216 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,940 కోట్ల) విలువైన రైలు తయారీ కాంట్రాక్టుకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ సీఆర్‌ఆర్‌సీ అర్హత పొందలేకపోయింది.
వివరాలు
చైనా నుంచి యంత్రాలు,పరికరాల దిగుమతులపై ఉన్న ఆంక్షలు
ఈ ఒక్క, ఆంక్షల వల్ల అనేక కీలక మౌలిక వసతి ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని పలు ప్రభుత్వ విభాగాలు ఆర్థిక శాఖ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. అందుకే చైనా కంపెనీలకు కొంతమేర మినహాయింపులు ఇవ్వాలని పలు మంత్రిత్వ శాఖలు కోరినట్లు తెలిసింది. మరొకవైపు, చైనా నుంచి యంత్రాలు,పరికరాల దిగుమతులపై ఉన్న ఆంక్షలు భారత విద్యుత్ రంగ ప్రణాళికలపైనా ప్రభావం చూపుతున్నాయి. వచ్చే పదేళ్లలో దేశంలో 307 గిగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న లక్ష్యానికి ఈ పరిమితులు అడ్డంకిగా మారుతున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
వివరాలు
చైనా కంపెనీలపై ఉన్న ఆంక్షలను సడలించాలని సిఫారసు
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ మాజీ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ కూడా చైనా కంపెనీలపై ఉన్న ఆంక్షలను సడలించాలని సిఫారసు చేసినట్లు సమాచారం. అయితే, ప్రభుత్వ కాంట్రాక్టుల విషయంలో ఆంక్షలను ఎత్తివేసినా, చైనా నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై విధించిన పరిమితులను మాత్రం కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వర్గాలు వెల్లడించాయి.