India-Venezuela Oil: వెనెజువెలా నుంచి చమురు దిగుమతులు.. భారత్‌కు ఏటా 3 బిలియన్ డాలర్ల ఆదా: ఎస్‌బీఐ రిపోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాతో ట్రేడ్ డీల్‌పై అవగాహనకు వచ్చిన భారత్ తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. వెనెజువెలా నుంచి ముడి చమురు కొనుగోళ్లకు సిద్ధమవడంతో దేశానికి ఏటా భారీగా లాభం చేకూరే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ వెల్లడించింది. ఈ మార్పుతో భారత్‌కు సంవత్సరానికి సుమారు 3 బిలియన్ డాలర్ల వరకు ఆదా కానుందని నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం రష్యా నుంచి చేస్తున్న చమురు దిగుమతులను వెనెజువెలా వైపు మళ్లిస్తే మొత్తం దిగుమతి వ్యయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. వెనెజువెలా ముడి చమురు బ్యారెల్‌పై 10 నుంచి 12 డాలర్ల వరకు తగ్గింపు లభిస్తే, భారత్‌కు అది మరింత లాభదాయకమవుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ వివరించింది.
వివరాలు
వెనెజువెలా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర సుమారు 51డాలర్లు
రవాణా ఖర్చులు, ఇతర అనుబంధ వ్యయాలు అన్నీ తీసేసినా కూడా చమురు దిగుమతుల బిల్లు ఏటా సుమారు 3బిలియన్ డాలర్ల మేర తగ్గుతుందని అంచనా వేసింది. తాజా చమురుధరల ప్రకారం వెనెజువెలా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర సుమారు 51డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోందని నివేదికలో పేర్కొన్నారు. అయితే రష్యా నుంచి వెనెజువెలాకు ముడి చమురు కొనుగోళ్లను మార్చే విషయంలో అనేక అంశాలను భారత్ జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా డిస్కౌంట్ పరిమాణం, రవాణా ఖర్చులు,రవాణాకు పట్టే సమయం,బీమా వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మొత్తం వ్యయాన్ని లెక్కించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. భౌగోళికంగా వెనెజువెలా భారత్‌కు చాలా దూరంగా ఉండటంతో అక్కడి నుంచి చమురు రవాణాకు ఎక్కువ సమయం పడుతుంది.
వివరాలు
రష్యా నుంచి ప్రస్తుతం లభిస్తున్న డిస్కౌంట్ ధరలు దీర్ఘకాలం కొనసాగకపోవచ్చు
పశ్చిమాసియా దేశాలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ సమయం అవసరం అవుతుండగా, రష్యా నుంచి వచ్చే సరఫరాతో పోలిస్తే రెట్టింపు సమయం పడుతుందని అంచనా. దీంతో వెనెజువెలా చమురుపై రవాణా వ్యయం అదనపు భారం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రష్యా నుంచి ప్రస్తుతం లభిస్తున్న డిస్కౌంట్ ధరలు దీర్ఘకాలం కొనసాగకపోవచ్చన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధ పరిస్థితులు సద్దుమణిగితే రష్యా చమురుపై ఇచ్చే తగ్గింపులు నిలిచిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వెనెజువెలా నుంచి చమురు కొనుగోళ్ల వైపు భారత్ దృష్టి సారించడం వ్యూహాత్మకంగా కీలకంగా మారిందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.