
Piyush Goyal on tariffs: పరస్పర సుంకాల అంశాన్ని భారత్ జాగ్రత్తగా హ్యండిల్ చేస్తోంది: పియూష్ గోయెల్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా విధించిన సుంకాల విషయంలో భారత్ ఎంతో తెలివిగా స్పందించిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు.
అమెరికాతో వాణిజ్యాన్ని సుమారు రెండున్నర రెట్లు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
ట్రంప్ ప్రభుత్వం వివిధ దేశాలపై విధించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా విరమించిన సందర్భంలో, ముంబయిలో విలేకరులతో మాట్లాడారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత మెరుగుపరచేందుకు, ద్వైపాక్షిక సంబంధాలను బలపరచేందుకు, భారత ప్రధాని నరేంద్ర మోదీ,అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో గత ఫిబ్రవరిలో ఓ కీలక ఒప్పందం కుదిరిందని గోయల్ పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ఫలితంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని చెప్పారు.
వివరాలు
ద్వైపాక్షిక ఒప్పందం కీలక పాత్ర
ఇది గత స్థితితో పోలిస్తే సుమారు రెండున్నర రెట్లు అధికమని వివరించారు.
దీని వల్ల దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, అలాగే ఆర్థిక వ్యవస్థ మరింతగా బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం భారత్-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, ఈ చర్చల్లో భారత్‌కే ఆధిక్యం ఉందని గోయల్ తెలిపారు.
అంతకుముందు ఆయా వాణిజ్య ఒప్పందాలపై పరిశ్రమలకు చెందిన ప్రతినిధులతో భేటీ అయిన ఆయన, దేశ వాణిజ్య వ్యూహాలపై చర్చించారు.
దేశ ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాముఖ్యమని పేర్కొంటూ, 2047 నాటికి 'వికసిత భారత్' లక్ష్యాన్ని సాధించడంలో ఈ ద్వైపాక్షిక ఒప్పందం కీలక పాత్ర పోషించనుందని పీయూష్ గోయల్ నొక్కి చెప్పారు.