World Bank: 2047 నాటికి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం మారాలంటే.. ప్రపంచ బ్యాంకు సూచనలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్రభుత్వం 2047 నాటికి దేశాన్నివికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఈ దిశగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. అయితే, భారత్ అధిక ఆదాయ దేశంగా మారాలంటే 7.8 శాతం వృద్ధి రేటును సాధించాలని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన తన ఇండియా కంట్రీ మెమోరాండమ్‌లో పేర్కొంది.
ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశ స్థూల జాతీయ ఆదాయం ప్రస్తుత స్థాయికి పోలిస్తే సుమారు 8 రెట్లు పెరగాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
దీనికోసం ఆర్థిక రంగంతో పాటు భూ, కార్మిక రంగాల్లో సంస్కరణలు కూడా కీలకమని సూచించింది.
ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలను కొనసాగించడమే కాకుండా, కొత్త సంస్కరణలను విస్తరించడంపై దృష్టిపెట్టాలని వివరించింది.
వివరాలు
రాబోయే దశాబ్దాల్లో సగటున 7.8 శాతం వృద్ధి రేటు
2047 నాటికి భారత్ అధిక ఆదాయ దేశంగా మారాలంటే రాబోయే దశాబ్దాల్లో సగటున 7.8 శాతం వృద్ధి రేటును కొనసాగించాల్సిన అవసరం ఉందని, వేగవంతమైన సంస్కరణల ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
2000 నుంచి 2024 మధ్య భారత్ వృద్ధి రేటు సగటున 6.3 శాతంగా నమోదైందని పేర్కొంది.
గ్లోబల్ తయారీ హబ్‌గా ఎదగేందుకు ఇటీవలి కాలంలో దేశం అనేక నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకువచ్చిందని, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మానవ మూలధనాన్ని మెరుగుపరిచే చర్యలు, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించే విధానాలు ఈ మార్పులో ప్రధాన పాత్ర వహిస్తున్నాయని వివరించింది.
వివరాలు
మహిళా కార్మిక శక్తిని 50శాతం పెంచాలి
చిలీ, కొరియా, పోలాండ్ వంటి దేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా భాగస్వామ్యమై మధ్య స్థాయి ఆదాయం నుంచి అధిక ఆదాయ దేశాలుగా ఎదిగాయన్న విషయాన్ని అధ్యయనం చేయాలని ప్రపంచ బ్యాంక్ ఇండియా కంట్రీ డైరెక్టర్ అగస్టే టానో కౌమే సూచించారు.
భారత్ తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యాన్ని ప్రస్తుత 35.6 శాతం నుంచి 50 శాతానికి పెంచడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
వివరాలు
ప్రపంచంలో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
2000 నుంచి ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు నాలుగు రెట్లు పెరిగిందని, తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగిందని నివేదికలో వెల్లడించారు.
2000లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 1.6 శాతం ఉండగా, 2023 నాటికి ఇది 3.4 శాతానికి చేరుకుందని తెలియజేశారు.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, పేదరికం తగ్గుదల, మౌలిక సదుపాయాల విస్తరణ, సేవలు, డెలివరీ రంగాల వృద్ధి ఇందుకు ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు.