India Post: ఇండియా పోస్ట్ బిగ్ అప్‌డేట్: వేగవంతమైన డెలివరీకి 3 కొత్త సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
తపాలా శాఖలో సేవల నాణ్యతను పెంచే దిశగా కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. అత్యవసర పార్శిళ్లను వేగంగా చేరవేయడానికి 24 గంటలు, 48 గంటల డెలివరీ గ్యారెంటీతో మూడు ప్రీమియం సేవలను ప్రవేశపెట్టారు. ఇందులో 24 స్పీడ్ పోస్ట్, 24 స్పీడ్ పోస్ట్ పార్శిల్, 48 స్పీడ్ పోస్ట్ సేవలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సేవలను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధికారికంగా ప్రారంభించారు. డాక్యుమెంట్లు, పార్శిళ్లు వంటి సరుకులను 24 లేదా 48 గంటల్లోనే గమ్యస్థానానికి చేర్చడం ఈ సేవల ప్రధాన లక్ష్యం.
వివరాలు
సేవల్లో ఆలస్యం జరిగితే వినియోగదారులకు..
మొదటి దశలో ఈ సదుపాయాలు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో అందుబాటులోకి రానున్నాయని సింధియా వెల్లడించారు. కస్టమర్లకు ఓటీపీ ఆధారిత డెలివరీ, సరుకు చేరే వరకు ఎస్సెమ్మెస్ అలర్ట్స్, వ్యాపార సంస్థల కోసం 'బై నౌ పే లేటర్' సౌకర్యం, భారీ స్థాయి బుకింగ్‌లకు ఉచిత పికప్, జియో ట్యాగింగ్, సెంట్రలైజ్డ్ బిల్లింగ్ వంటి అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. సేవల్లో ఆలస్యం జరిగితే వినియోగదారులకు చెల్లించిన మొత్తాన్ని తిరిగి అందించే విధానాన్ని కూడా అమలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని ఈ-కామర్స్ మార్కెట్ విలువ సుమారు రూ.11 లక్షల కోట్లు కాగా, 2030 నాటికి ఇది రూ.30 లక్షల కోట్లకు పెరుగుతుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.