అమెరికాకు భారత్ గుడ్ న్యూస్.. G-20కి ముందు వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత
ఈ వార్తాకథనం ఏంటి
G-20 శిఖరాగ్ర సమావేశానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాకు చెందిన పలు ఉత్పత్తులపై అదనపు సుంకాలను ఎత్తివేసేందుకు నిర్ణయించింది.
ఈ మేరకు 6 రకాల అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న అదనపు సుంకాలను భారత్ ఎత్తివేసింది.వీటిలో శెనగలు, ఉల్వలు, యాపిల్స్, వాల్‌నట్స్, బాదం లాంటి ఆహార ఉత్పత్తులున్నాయి.
2019లో భారత్ లో ఉత్పత్తి అయ్యే ఉక్కు,అల్యూమినియంపై అగ్రరాజ్యం సుంకాలను పెంచింది. బదులుగా భారత్ సైతం పలు ఉత్పత్తులపై అదనపు సుంకాలను ప్రవేశపెట్టింది.
తాజాగా జీ-20 సమావేశానికి ముందు వాటిలో కొన్నింటికి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీ-20 సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో ప్రధాని మోదీ కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.
DETAILS
వాణిజ్య వివాదాలను పరిష్కారానికి ఇరు దేశాలు గ్రీన్ సిగ్నల్
ఈ నేపథ్యంలో భారత్ సర్కార్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. గత జూన్‌లో ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించారు.
ఈ మేరకు ఆరు ఆంశాలకు సంబంధించి వాణిజ్య వివాదాలను పరిష్కరించేందుకు ఇరు దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇందులో అదనపు సుంకాల అంశం కూడా ఉండటం గమనార్హం.
మరోవైపు అమెరికా బాదం, వాల్‌నట్స్, శెనగలు, ఉల్వలు, యాపిల్స్ , వైద్య పరీక్షల రీఏజెంట్స్, బోరిక్ యాసిడ్‌పై కొనసాగుతున్న అదనపు సుంకాలను ఎత్తివేస్తామని జులైలో రాజ్యసభలో కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ ప్రకటించారు.
ఈ నిర్ణయం ఫలితంగా భారత్‌కు నష్టమేం లేదని ఆమె స్పష్టం చేశారు. 2022- 23లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సరకుల వాణిజ్యం 128.8 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గమనార్హం.