Hurun Rich List 2024: హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ.. అతని సంపద ఎంత పెరిగింది?
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ,అతని కుటుంబం భారతదేశంలోని సంపన్న కుటుంబాలలో ఒకటి. హురున్ ఇండియా 2024 సంపన్నుల జాబితాలో ఇది వెల్లడైంది. జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన గౌతమ్ అదానీ సంపద 95 శాతం పెరిగి రూ.11.61 లక్షల కోట్లు దాటింది. హురున్ ఇండియా ప్రకారం, దేశవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. గత 13 ఏళ్లతో పోలిస్తే ఇది గణనీయంగా పెరిగింది.
భారతదేశంలో 334 మంది బిలియనీర్లు
జాబితా ప్రకారం, భారతదేశంలో ఇప్పుడు 334 మంది బిలియనీర్లు ఉన్నారు, ఇది 13 సంవత్సరాల క్రితం జాబితాను ప్రారంభించినప్పుడు బిలియనీర్ల సంఖ్య కంటే 6 రెట్లు ఎక్కువ. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ , అతని కుటుంబం జాబితాలో రెండవ స్థానంలో ఉన్నారు. ఆయన కుటుంబం మొత్తం సంపద రూ.10.14 లక్షల కోట్లుగా అంచనా. 7,300 కోట్ల నికర విలువతో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను హురున్ ఇండియా తొలిసారిగా రిచ్ లిస్ట్‌లో చేర్చుకుంది.
1,539 మంది భారతీయులు రూ.1,000 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉన్నారు
ఈసారి 1,539 మంది భారతీయులు హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో చేర్చబడ్డారు, వీరి మొత్తం సంపద రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ. ఈ జాబితాలో గతసారి కంటే 220 మంది ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి 272 మందిని జాబితాలో చేర్చగా, వీరి పేర్లు తొలిసారిగా నమోదయ్యాయి. సంస్థ ప్రకారం, గత సంవత్సరం భారతదేశంలో ప్రతి 5 రోజులకు ఒక కొత్త బిలియనీర్ పుట్టుకువస్తున్నాడు.