
India's poverty: దేశంలో క్రమంగా తగ్గుతున్న పేదరికం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని పేదరిక స్థాయి క్రమంగా తగ్గుతోందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా నివేదిక స్పష్టంగా వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పేదరిక స్థాయి 5.3శాతంగా ఉండగా,2023-24లో అది 4.6 శాతానికి తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది. పేదరికంపై ఎస్‌బీఐ చేసిన ఈ విశ్లేషణ ప్రపంచ బ్యాంక్ నివేదికతో సైతం సమానంగా ఉంది. ప్రపంచ బ్యాంక్ కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ,2023లో దేశంలో పేదరికం 5.3 శాతంగా ఉండగా,ప్రస్తుతం అది 4.6 శాతానికి చేరిందని స్పష్టం చేసింది. ఇది దేశం పేదరిక నిర్మూలన దిశగా మంచి పురోగతిని సాధిస్తున్నదానికి ఓ స్పష్టమైన సంకేతమని ఎస్‌బీఐ పేర్కొంది. అంతకుముందు,2011-12ఆర్థిక సంవత్సరంలో దేశంలో పేదరికం 27.1శాతంగా ఉన్నదని ఎస్‌బీఐ తన నివేదికలో వెల్లడించింది.
వివరాలు
పేదల్లో 65 శాతం మంది ఈ రాష్ట్రాల్లోనే..
ఇక మరోవైపు, ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ పావర్టీ లైన్ (అంతర్జాతీయ పేదరిక రేఖ)కు ఇటీవల మార్పులు చేసింది. గతంలో రోజుకు 2.15అమెరికన్ డాలర్ల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారిని పేదలుగా పరిగణించగా,ఇప్పుడు ఈ పరిమితిని 3 డాలర్లకు పెంచింది. దాంతో రోజుకు సుమారు రూ.260 కన్నా తక్కువ సంపాదించే వారిని పేదులుగా గుర్తిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం,2011-12లో దేశంలోని మొత్తం పేదల్లో సుమారు 65 శాతం మంది ఉత్తరప్రదేశ్,బీహార్,పశ్చిమ బెంగాల్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఉన్నారు. 2011-12లో గ్రామీణ భారత్‌లో పేదరికం స్థాయి 18.4శాతంగా ఉండగా,2022-23 నాటికి అది 2.8శాతానికి తగ్గింది. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో 2011-12లో 10.7శాతం పేదరికం ఉండగా, 2022-23 నాటికి అది కేవలం 1.1 శాతానికి పడిపోయింది.