Rupee Value: ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకున్న రూపాయి విలువ..!
అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ మరొకసారి ఎన్నికైన తరువాత రూపాయి విలువ మరింతగా క్షీణిస్తోంది. బుధవారం ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఒకే రోజులో 03 పైసలు పడిపోయి, రూపాయి 84.94 స్థాయికి దిగజారింది. దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలతో రూపాయి బలహీనపడుతున్నట్టు మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
రూపాయి విలువ 8-10 శాతం తగ్గే అవకాశం
ఈ పరిస్థితి మరింత దారుణంగా మారకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ట్రంప్ 2.0 పరిపాలనలో రూపాయి విలువ మరింతగా 8-10 శాతం తగ్గే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశోధన విభాగం అంచనా వేసింది. H1B వీసా పరిమితులు మరియు డాలర్ బలపడటంతో రూపాయి తాత్కాలిక అస్థిరతను ఎదుర్కొనే అవకాశముందని ఆ నివేదిక పేర్కొంది.