
Russian Oil: రష్యా చమురు కొనుగోళ్లను దేశీయ సంస్థ నిలిపివేసిందా..? అందులో నిజమెంత..!
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి పశ్చిమదేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, భారత్ మాత్రం మాస్కో నుంచి చమురు కొనుగోలు కొనసాగిస్తుండటంపై ఆ దేశాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టమైన వివరణలు ఇస్తున్నా... తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై గట్టిగా స్పందిస్తూ కొన్ని పెనాల్టీలను ప్రకటించారు. దీనివల్ల, రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించేందుకు భారత్‌లోని కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయని కథనాలు వెలువడ్డాయి.
వివరాలు
ప్రభుత్వం ఎలాంటి కొనుగోలు ఆదేశాలు జారీ చేయలేదు
దేశంలోని ప్రభుత్వ చమురు శుద్ధి సంస్థలు అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ వంటి సంస్థలు గత కొన్ని రోజులుగా రష్యా నుంచి ముడిచమురు (క్రూడ్ ఆయిల్) కొనడాన్ని నిలిపివేశాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయా రిఫైనరీలతో సంబంధం ఉన్న వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ 'రాయిటర్స్' ప్రత్యేక కథనంగా ప్రచురించింది. అయితే ఈ సంస్థలు ఇప్పటివరకు దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక ఉన్నతాధికారి స్పందిస్తూ... ప్రభుత్వం ఎలాంటి కొనుగోలు ఆదేశాలు జారీ చేయలేదని జాతీయ మీడియా నివేదించింది.
వివరాలు
అమెరికా సహా పలు పశ్చిమదేశాలు అభ్యంతరం
ప్రపంచవ్యాప్తంగా భారత్ మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారిగా ఉన్నది.ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రష్యా నుంచి తగ్గింపుతో ముడిచమురు కొనుగోలు చేస్తున్నది. ప్రస్తుతం భారత్‌కు అవసరమైన మొత్తం చమురులో సుమారుగా 35శాతం రష్యా నుంచే వస్తోంది. ఇదే అంశంపై అమెరికా సహా పలు పశ్చిమదేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ కొనుగోలు చేస్తున్న చమురే రష్యాకు యుద్ధాన్ని కొనసాగించే సామర్థ్యం ఇస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే,ఇదే అంశం న్యూదిల్లీతో జరుగుతున్న వాణిజ్య చర్చల్లో విఘాతం కలిగిస్తున్నదని అమెరికా విదేశాంగశాఖకు చెందిన మార్కో రుబియో వ్యాఖ్యానించారు. ఇక ట్రంప్ కూడా ఇటీవల మాట్లాడుతూ,రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న భారత్‌పై 25శాతం సుంకాలను విధించడంతో పాటు అదనంగా పెనాల్టీలు కూడా విధిస్తున్నట్టు తెలిపారు.