Loading...
Stock market: రెండో రోజూ నష్టాల్లో ముగిసిన సూచీలు.. ఆరు నెలల కనిష్ఠానికి మార్కెట్లు!
రెండో రోజూ నష్టాల్లో ముగిసిన సూచీలు.. ఆరు నెలల కనిష్ఠానికి మార్కెట్లు!

Stock market: రెండో రోజూ నష్టాల్లో ముగిసిన సూచీలు.. ఆరు నెలల కనిష్ఠానికి మార్కెట్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2026
04:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరలు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. దీనికి తోడు విదేశీ మదుపర్లు భారీగా అమ్మకాలకు దిగడం కూడా దేశీయ మార్కెట్‌లో మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో కీలక సూచీలు ఆరు నెలల కనిష్ఠ స్థాయికి చేరాయి. సెన్సెక్స్‌ ఉదయం 72,633.68 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. క్రితం సెషన్‌లో ఈ సూచీ 72,771.72 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్‌ భారీ నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో దాదాపు 700 పాయింట్లు నష్టపోయి 72,064.00 పాయింట్ల వద్ద కనిష్ఠ స్థాయిని తాకింది.

వివరాలు

లాభాల్లో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్టీపీసీ షేర్లు

ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ.. చివరికి 242.65 పాయింట్ల నష్టంతో 72,529.07 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ కూడా నష్టాల్లోనే ముగిసింది.

సూచీ 64.05 పాయింట్లు కోల్పోయి 22,716.20 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.98గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

మరోవైపు అదానీ పోర్ట్స్‌, సన్‌ఫార్మా, టాటా స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి.

క్రూడాయిల్‌ ధరలు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 104 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బంగారం ఔన్సు ధర 4,149 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ADVERTISEMENT