Page Loader
Infosys: ఇన్ఫోసిస్‌లో అర్హులైన ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి లేఖలు జారీ.. 20% ఇంక్రిమెంట్‌!
ఇన్ఫోసిస్‌లో అర్హులైన ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి లేఖలు జారీ

Infosys: ఇన్ఫోసిస్‌లో అర్హులైన ఉద్యోగుల వేతనాల పెంపునకు సంబంధించి లేఖలు జారీ.. 20% ఇంక్రిమెంట్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2025
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) అర్హులైన ఉద్యోగులకు వేతనాల పెంపును (Salary Hike) ప్రకటించింది. ఈ మేరకు ఉద్యోగులకు సంబంధిత లేఖలు జారీ చేసినట్లు సమాచారం.చాలామంది ఉద్యోగులకు 5 నుంచి 8 శాతం వరకు జీతాన్నిపెంచినట్లు తెలుస్తోంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు 20 శాతం వరకు వేతన పెంపు లభించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ 'ఎకనామిక్‌ టైమ్స్‌' తన కథనంలో వెల్లడించింది. ఇన్ఫోసిస్‌ సంస్థ ఉద్యోగులను మూడు విభాగాలుగా వర్గీకరించింది.కంపెనీ అంచనాలను అందుకున్న వారికి 5-7 శాతం వేతన పెంపు కల్పించగా,మంచి పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 7-10 శాతం జీత పెంపును అందించింది.

వివరాలు 

2022లో వేతనాల పెంపు నిలిపివేత 

అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఉద్యోగులకు 10-20 శాతం వరకు వేతన పెంపును అమలు చేసింది.ఇక తక్కువ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు వేతన పెంపు ప్రకటించలేదు. లెవల్ 5లో ఉన్న టీం లీడర్లు, దిగువ స్థాయి ఉద్యోగులకు 2024 జనవరి 1 నుంచి జీతాల పెంపు అమలులోకి రాగా, లెవల్ 6లో ఉన్న మేనేజర్లకు ఏప్రిల్‌ నుంచి పెంపు కల్పించనున్నారు. వ్యయ నియంత్రణలో భాగంగా ఇన్ఫోసిస్‌ 2022లో వేతనాల పెంపును నిలిపివేసింది. చివరిసారిగా 2023 నవంబర్‌లో జీతాల పెంపును ప్రకటించిన ఇన్ఫోసిస్‌, అప్పటి నుంచి వేతన పెంపును నిలిపివేసింది. అయితే, 2023 నవంబర్‌లో అమలుచేసిన వేతన పెంపుతో పోలిస్తే ఈ ఏడాది పెంపు 5-10 శాతం తక్కువగా ఉందని సమాచారం.

వివరాలు 

అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాల  నమోదు 

ఇన్ఫోసిస్‌ అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. రూ.6,806 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని సాధించగా, మొత్తం ఆదాయం రూ.38,821 కోట్ల నుంచి 7.58 శాతం పెరిగి రూ.41,764 కోట్లకు చేరింది. ఇన్ఫోసిస్‌ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 15,000 మందికి పైగా ఉద్యోగులను నియమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో సంస్థ నికరంగా 5,591 మంది ఉద్యోగులను చేర్చుకున్నట్లు ప్రకటించింది. ఫలితంగా మొత్తం సిబ్బంది సంఖ్య 3,23,379కు పెరిగింది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో 20,000 మందికి పైగా తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్స్) నియమించేందుకు కంపెనీ యోచిస్తోంది.