
Infosys: మైసూరు క్యాంపస్‌లో మరో 195 మంది ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయంగా రెండో అతిపెద్ద ఐటీ సంస్థగా గుర్తింపు పొందిన ఇన్ఫోసిస్ మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది.
మైసూర్ క్యాంపస్‌లో శిక్షణ పొందుతున్న ట్రైనీలను ఆ సంస్థ తొలగించింది.
అంతర్గత మూల్యాంకన పరీక్షలో విఫలమయ్యారన్న కారణంతో ఏకంగా 195 మందిని సంస్థ బయటకు పంపించింది.
ఏప్రిల్ 29న పంపిన కంపెనీ మెయిల్స్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఫిబ్రవరి నుంచీ ఇప్పటి వరకు సంస్థ తొలగించిన ట్రైనీల మొత్తం సంఖ్య సుమారు 800కు చేరుకుంది.
ఐటీ రంగంలో నెలకొన్న అస్థిర పరిస్థితులు, మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య ఇన్ఫోసిస్ ఈ విధంగా కఠిన నిర్ణయాలను తీసుకుంటోంది.
వివరాలు
నాలుగు విడతలుగా ట్రైనీలను తొలగించిన ఇన్ఫోసిస్
ప్రస్తుత మార్కెట్‌లో డిమాండ్ తగ్గిపోవడం, ఆర్థిక మందగమన భయాలు ఉండటం వంటి కారణాలతో అనేక ఐటీ సంస్థలు వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాయి.
అందులో భాగంగా ఉద్యోగుల తొలగింపులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్ఫోసిస్ ఇప్పటివరకు నాలుగు విడతలుగా ట్రైనీలను తొలగించింది.
ఫిబ్రవరిలో 300 మందిని, మార్చిలో 30-35 మందిని, ఏప్రిల్ 18న 240 మందిని తొలగించగా, తాజాగా మరో 195 మందిని ఇంటికి పంపించింది.
శిక్షణ సమయంలో సరైన ప్రతిభ కనబర్చలేకపోవడమే ఇందుకు కారణమని కంపెనీ స్పష్టం చేసింది.
వివరాలు
150 మంది ఇతర కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు
అయితే, సంస్థ తొలగించిన ట్రైనీలకు పూర్తిగా సహాయపడుతోంది. వారికోసం ఉచిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అందిస్తోంది. ఈ శిక్షణ 'అప్‌గ్రాడ్' సంస్థ ద్వారా బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్) రంగంలో, 'ఎన్ఐఐటీ' ద్వారా ఐటీ రంగంలో అందించనున్నారు.
ఇప్పటికే సుమారు 250 మంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లలో చేరగా, మరో 150 మంది ఇతర కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇన్ఫోసిస్ ఈ శిక్షణా కార్యక్రమాల కోసం అప్‌గ్రాడ్, ఎన్ఐఐటీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.
శిక్షణలో విఫలమైన ట్రైనీలకు ప్రత్యామ్నాయ కెరీర్ అవకాశాలు అందించేందుకు కూడా కంపెనీ ముందుకు వచ్చింది.
బీపీఎం విభాగంలో ఉద్యోగాలు అందించేందుకు 12 వారాల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది.
వివరాలు
ఒక నెల ఎక్స్‌గ్రేషియా చెల్లింపుతో పాటు రిలీవింగ్ లెటర్
దీనికి అవసరమైన ఖర్చును సంస్థే భరిస్తోంది. అలాగే, బీపీఎం రంగాన్ని ఎంచుకోని వారికి మైసూర్ నుంచి బెంగళూరుకు రవాణా సదుపాయాన్ని, స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రయాణ భత్యాన్ని కూడా అందిస్తోంది.
అవసరమైతే, వారు వెళ్లే వరకు మైసూర్‌లోని ఎంప్లాయీ కేర్ సెంటర్‌లో బస చేయడానికి వీలు కల్పిస్తోంది.
అంతేకాకుండా, బాధితులకు ఒక నెల ఎక్స్‌గ్రేషియా చెల్లింపుతో పాటు రిలీవింగ్ లెటర్ కూడా ఇవ్వనుంది.
వివరాలు
ఇన్ఫోసిస్ తీసుకుంటున్న చర్యలు ఉద్యోగార్థుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి
ఇక ఈ తొలగింపులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక కార్మిక శాఖ ఇప్పటికే ఇన్ఫోసిస్‌కు క్లిన్ చిట్ ఇచ్చింది.
ఇది ఉద్యోగం కాకుండా కేవలం శిక్షణే అయినందున, కార్మిక చట్టాలు ఇక్కడ వర్తించవని స్పష్టం చేసింది.
మొత్తంగా చూస్తే, ఐటీ రంగంలో కొనసాగుతున్న అస్థిరత నేపథ్యంలో ఇన్ఫోసిస్ తీసుకుంటున్న చర్యలు ఉద్యోగార్థుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి.
శిక్షణ పూర్తికాకముందే పెద్ద సంఖ్యలో ట్రైనీలను తొలగించడం భవిష్యత్ నియామక ప్రక్రియలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.