Page Loader
Infosys: ఉద్యోగుల జీతాలు పెంచిన ఇన్ఫోసిస్ .. ఎంతంటే..?
ఉద్యోగుల జీతాలు పెంచిన ఇన్ఫోసిస్ .. ఎంతంటే..?

Infosys: ఉద్యోగుల జీతాలు పెంచిన ఇన్ఫోసిస్ .. ఎంతంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2025
06:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ (Infosys),2025 ఫిబ్రవరి చివరి నాటికి వేతన ఇంక్రిమెంట్ లెటర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఏప్రిల్ నుండి కొత్త ఇంక్రిమెంట్లు అమల్లోకి రానున్నాయని తెలిపింది. అయితే, వేతన పెంపు శాతం ఎంత ఉంటుందనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. అయితే, సగటు వేతన పెంపు 5% నుండి 8% మధ్య ఉండొచ్చని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. ఇన్ఫోసిస్ సంస్థలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేతన పెంపు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుంది. వేతన సవరణలు దశలవారీగా జరుగుతాయని కంపెనీ స్పష్టం చేసింది.

వివరాలు 

ఇంక్రిమెంట్లతో పాటు, బ్యాచ్‌ల వారీగా ప్రమోషన్ లెటర్లు 

మొదటి దశ జనవరి 2025 నుండి, రెండో దశ ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఇంక్రిమెంట్లతో పాటు, బ్యాచ్‌ల వారీగా ప్రమోషన్ లెటర్లు కూడా జారీ చేయనున్నట్లు వెల్లడించింది. మొదటి బ్యాచ్‌కు 2024 డిసెంబర్‌లో ప్రమోషన్ లెటర్లు ఇచ్చినట్లు కంపెనీ పేర్కొంది. మరొక బ్యాచ్‌కు 2025 ఫిబ్రవరి చివరిలో లెటర్లు పంపనున్నట్లు తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక సేవలు అందించే సంస్థల టెక్నాలజీ మూలధన వ్యయం పెరుగుతుందని అనేక ఐటీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, వేతనాల పెంపుపై నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ కూడా వేతన సవరణ చేపట్టిందని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు.

వివరాలు 

700 మంది ఫ్రెషర్లు తొలగింపు

అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల మధ్య ఇన్ఫోసిస్ తీసుకున్న వేతన పెంపు నిర్ణయం ఉద్యోగులకు సానుకూల సంకేతంగా మారింది. అయితే, ఇన్ఫోసిస్ సంస్థ ఇటీవల మైసూరు క్యాంపస్ నుండి సుమారు 700 మంది ఫ్రెషర్లను తొలగించిన ఘటనపై విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగంలోకి తీసుకున్నప్పటికీ, కేవలం ఆరు నెలల వ్యవధిలోనే వారిని తొలగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ఐటీ ఉద్యోగుల సంఘం NITES అనైతిక చర్యగా అభివర్ణించింది.