Navratna Status: నవరత్న హోదా పొందిన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం రైల్వేకు చెందిన రెండు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ప్రకటించింది.
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC)లకు నవరత్న హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ప్రకటన చేసింది.
నవరత్న హోదా పొందిన 25, 26వ కంపెనీలు
IRCTC 25వ నవరత్న కంపెనీగా గుర్తింపు పొందగా, IRFC 26వ నవరత్న కంపెనీగా అప్‌గ్రేడ్ చేశారు.
IRCTC గత ఆర్థిక సంవత్సరానికి రూ. 4,270.18 కోట్ల వార్షిక టర్నోవర్‌ను సాధించగా, IRFC రూ. 26,644 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది.
Details
నవరత్న హోదా అంటే ఏమిటి?
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు మినీరత్న, నవరత్న, మహారత్న అనే మూడు స్థాయిల హోదాలను కేంద్రం కేటాయిస్తుంది.
నిర్వహణ పరంగా, ఆర్థిక స్థాయిలో నిర్దిష్ట లక్ష్యాలను చేరుకున్న సంస్థలకు ఈ హోదాను అందిస్తుంది. నవరత్న హోదా పొందిన సంస్థలు పెట్టుబడుల విషయంలో మరింత స్వేచ్ఛను పొందుతాయి.
నవరత్న హోదా కలిగిన సంస్థలు రూ.1,000 కోట్లు లేదా మొత్తం విలువలో 15 శాతం మేర ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టుబడులు పెట్టగలవు.
ప్రస్తుతం భారత్ ఎలక్ట్రానిక్స్, కంటైనర్ కార్పొరేషన్, హిందుస్థాన్ ఎరోనాటిక్స్, ఆయిల్ ఇండియా, వైజాగ్ స్టీల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్న హోదా కలిగి ఉన్నాయి.
IRCTC, IRFC నవరత్న హోదా పొందడంతో, వీటి కార్యకలాపాల్లో మరింత స్వేచ్ఛ లభించనుంది.