
ITR Deadline: ఫేక్ న్యూస్‌పై ఐటీ శాఖ హెచ్చరిక.. రిటర్నుల గడువులో మార్పు లేదు
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాంటి జరిమానాలు లేకుండా పన్ను రిటర్నులు దాఖలు చేసే అవకాశం ఉండదని ఆదాయపు పన్ను విభాగం స్పష్టం చేసింది. ఈ గడువును పొడిగించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ, ఐటీ శాఖ వాటిని పూర్తిగా నిరాకరించింది. 'ఐటీఆర్ ఫైలింగ్ గడువును ఇప్పటికే జూలై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించాం. ఇప్పుడు మరల సెప్టెంబరు 30 వరకు పొడిగించామన్న వార్తలు అసత్యం. ఇవి పూర్తిగా నకిలీ ప్రచారం. ఐటీఆర్ దాఖలుకు తుది గడువు సెప్టెంబరు 15 మాత్రమే. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఫేక్ న్యూస్ నమ్మకండి. ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా ఇచ్చే అప్‌డేట్లను మాత్రమే అనుసరించాలని ఐటీ విభాగం తమ అధికారిక 'ఎక్స్' ఖాతాలో ప్రకటించింది.
Details
రూ.6 కోట్లకు పైగా రిటర్నులు సమర్పించాలి
పన్ను చెల్లింపుదారులకు సహాయం అందించేందుకు 24×7 హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది. కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ సెషన్స్ మరియు ఎక్స్ వేదిక ద్వారా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకు 6 కోట్లకు పైగా పన్ను చెల్లింపుదారులు రిటర్నులు సమర్పించారని, వాటిలో 5.51 కోట్లు ఇ-వెరిఫై అయ్యాయని ఐటీ శాఖ వివరించింది. ఇందులో 3.78 కోట్ల రిటర్నుల పరిశీలన పూర్తయిందని పేర్కొంది. రూ.3 లక్షలకు పైబడిన ఆదాయం కలిగిన ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేయాలని సూచించింది.
Details
నోటీసులు, జరిమానా తప్పనిసరి
కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం ఏది తమకు అనుకూలమో పన్ను చెల్లింపుదారులు సరిగ్గా పరిశీలించి ఎంచుకోవాలని సూచించింది. అలాగే తప్పుడు మినహాయింపులు చూపించి రిఫండ్ కోరడం తీవ్రమైన తప్పిదమని హెచ్చరించింది. భవిష్యత్తులో అలాంటి చర్యలు పన్ను చెల్లింపుదారులకు నోటీసులు, జరిమానాలు తప్పనిసరి చేస్తాయని స్పష్టం చేసింది. మొత్తంగా సెప్టెంబరు 15 తర్వాత జరిమానా లేకుండా ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఉండదని, ఫేక్ న్యూస్ నమ్మకుండా వెంటనే రిటర్నులు పూర్తి చేయాలని ఐటీ విభాగం హెచ్చరిస్తోంది.