ITR filing : ఐటీఆర్ మిస్ చేశారా? డిసెంబర్ 31 వరకూ చివరి అవకాశం!
ఈ వార్తాకథనం ఏంటి
గత ఆర్థిక సంవత్సరం (2024-25)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఇప్పటివరకు దాఖలు చేయకపోయినా భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా అవకాశం ఉంది. డిసెంబర్ 31 వరకు ఆలస్య రిటర్నులు (బిలేటెడ్) లేదా సవరించిన రిటర్నులు (రివైజ్డ్) సమర్పించుకోవచ్చు. ఈ మదింపు సంవత్సరం 2025-26కు సంబంధించి సాధారణ గడువు ఇప్పటికే సెప్టెంబర్ 16తో ముగిసింది. అయినప్పటికీ రిటర్న్ దాఖలు చేయడం మరిచిపోయినా, లేదా దాఖలు చేసిన రిటర్నులో ఏదైనా తప్పు ఉన్నట్టు ఇప్పుడు గుర్తించినా, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం రివైజ్డ్ లేదా బిలేటెడ్ ఐటీఆర్‌ను సమర్పించే వెసులుబాటు ఉంటుంది.
వివరాలు
డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా రిటర్న్ దాఖలు
పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000 వరకు, రూ.5 లక్షలు మించితే రూ.5,000 వరకు ఆలస్య రుసుము చెల్లించి బిలేటెడ్ రిటర్న్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక మీకు రీఫండ్ రావాల్సి ఉన్నట్లయితే, డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా రిటర్న్ దాఖలు చేయాలి. ఆ తరువాత గడువు మించి వెళ్లితే ఆ రీఫండ్‌ను పొందే అవకాశం కోల్పోతారు. ఐటీఆర్ పూర్తిచేసేటప్పుడు పొరపాటున ఏవైనా కీలక వివరాలు మిస్ చేయడం, లేదా తప్పుగా నమోదు చేయడం సాధారణంగా ఎదురయ్యే విషయమే. అటువంటి పరిస్థితుల్లో ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేసుకోవచ్చు.
వివరాలు
న్యూ టాక్స్ రీజీమ్..
ముఖ్యంగా విదేశీ ఆస్తుల వివరాలను పేర్కొనకుండా మర్చిపోవడం, అవసరానికి మించి రీఫండ్ కోరడం, అర్హత ఉన్న మినహాయింపులను చూపకపోవడం, టీడీఎస్ వివరాలు సరిగా నమోదు కాకపోవడం వంటి సందర్భాల్లో సవరించిన రిటర్న్ సమర్పించడం ద్వారా తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. గమనిక: ఆలస్యంగా సమర్పించే బిలేటెడ్ రిటర్న్‌లను కొత్త పన్ను విధానం (న్యూ టాక్స్ రీజీమ్) కింద మాత్రమే ఫైల్ చేయాల్సి ఉంటుంది.