
Jaguar Land Rover: జాగ్వార్ ల్యాండ్ రోవర్ కీలక నిర్ణయం.. అమెరికాలో ఎగుమతులకు బ్రేక్
ఈ వార్తాకథనం ఏంటి
టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అమెరికాకు బ్రిటన్‌లో తయారయ్యే కార్లను ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోకి దిగుమతయ్యే వాహనాలపై 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించినట్టు 'ది టైమ్స్' రిపోర్ట్ చేసింది.
ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై ప్రస్తుతం జేఎల్‌ఆర్ ఆలోచనలో ఉందని వెల్లడించింది.
ట్రంప్ విధించిన టారిఫ్‌ల వల్ల వ్యాపారంపై పడే ప్రభావాన్ని అంచనా వేసే పనిలో సంస్థ తలమునకగా ఉంది.
ఇందుకోసం తాత్కాలికంగా ఒక నెలపాటు అమెరికాకు ఎగుమతులను నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Details
రెండు నెలలకు సరిపడా అమెరికాకు కార్ల ఎగుమతి
బ్రిటన్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన జేఎల్‌ఆర్ దాదాపు 38,000మందికి ఉపాధి కల్పిస్తోంది.
బ్రిటన్‌లో తయారు చేసిన వాహనాలను అమెరికాకు పంపడం గురించి జేఎల్‌ఆర్ మాత్రమే కాదు, ఇతర ప్రముఖ కార్ల తయారీ సంస్థలు కూడా తమ వ్యాపార వ్యూహాలను పునరాలోచిస్తున్నాయి.
జేఎల్‌ఆర్ ఇప్పటికే రాబోయే రెండు నెలలకు సరిపడా కార్లను అమెరికాకు ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది.
అయితే ట్రంప్ టారిఫ్‌ల ప్రకటన ప్రభావంతో టాటా మోటార్స్ షేర్లు పతనం కావడానికి ఇదే ప్రధాన కారణంగా మారింది.
2024 మార్చితో ముగిసిన 12 నెలల కాలంలో జేఎల్‌ఆర్ ప్రపంచవ్యాప్తంగా 4.30 లక్షల వాహనాలు విక్రయించగా, అందులో సుమారు నాలుగో వంతు వాహనాలు అమెరికాలోనే అమ్ముడయ్యాయి.
జేఎల్‌ఆర్ నిర్ణయం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.