
Jane Street:ఎస్క్రో ఖాతాలో రూ.4,800 కోట్లు డిపాజిట్ చేసిన జేన్ స్ట్రీట్.. సెబీని కొన్ని పరిమితులను ఎత్తివేయాలని అభ్యర్ధన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ రూ.4,843 కోట్లను ఎస్క్రో ఖాతాలో జమ చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఇది భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు చెల్లించిన డిపాజిట్ కావడం గమనార్హం. అయితే ప్రస్తుతం ఈ సంస్థకు దేశీయ మార్కెట్లలో ట్రేడింగ్ చేసే అవకాశం లేకపోయినప్పటికీ, సెబీ జారీ చేసిన ఆదేశాలను న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే జూలై 3న జేన్ స్ట్రీట్ సంస్థను మార్కెట్‌లో నేరుగా గానీ,పరోక్షంగా గానీ సెక్యూరిటీల కొనుగోళ్లు, విక్రయాలు చేయకుండా సెబీ నిషేధించింది. అదనంగా,బ్యాంకులు,కస్టోడియన్స్,డిపాజిటర్లు,రిజిస్ట్రార్లు,ట్రాన్స్‌ఫర్ ఏజెంట్లకు ఆ సంస్థ ఆస్తులతో సంబంధం ఉన్న లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
జేన్ స్ట్రీట్ భవిష్యత్తు కార్యకలాపాలను పర్యవేక్షించాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ ఆదేశం
అయితే సెబీ నిబంధనల ప్రకారం నగదు డిపాజిట్ చేయడంతో దేశీయ మార్కెట్లలో తిరిగి ట్రేడింగ్ ప్రారంభించడానికి మార్గం సుగమమవుతోంది. అయినప్పటికీ, సెబీ అభ్యంతరాలను తెలిపిన వ్యూహాన్ని సంస్థ అమలు చేయరాదని 'మనీ కంట్రోల్' నివేదిక పేర్కొంది. అలాగే, జేన్ స్ట్రీట్ భవిష్యత్తు కార్యకలాపాలను పర్యవేక్షించాలని స్టాక్ ఎక్స్చేంజీలకు సెబీ ఆదేశించింది. ప్రొప్రైటరీ ట్రేడింగ్ సేవలు అందించే జేన్ స్ట్రీట్ గ్రూపు సంస్థ 2000వ సంవత్సరంలో స్థాపించబడింది. అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాలలో ఉన్న కార్యాలయాల్లో సుమారు 2,600 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
వివరాలు
21 ట్రాన్సాక్షన్ల ద్వారా పెద్ద మొత్తాలు
భారత మార్కెట్లలో జేన్ స్ట్రీట్ దాదాపు రూ.44,358 కోట్లను అక్రమంగా ఆర్జించినట్లు సెబీ విచారణలో తేలింది. అదే సమయంలో స్టాక్ ఫ్యూచర్స్‌లో రూ.7,208 కోట్లను, ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో రూ.191 కోట్లను,నగదు విభాగంలో రూ.288 కోట్లను నష్టపోయినట్లు గుర్తించారు. ఈ నష్టాలను మినహాయిస్తే నికరంగా రూ.36,671 కోట్లను అక్రమంగా ఆర్జించినట్లు సెబీ పేర్కొంది. భారత మార్కెట్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ) కేటగిరీకి చెందిన ఈ సంస్థ నగదు, ఫ్యూచర్స్, ఆప్షన్స్ విభాగాల్లో ట్రేడింగ్ చేస్తూ ఎఫ్‌పీఐ నిబంధనలను ఉల్లంఘించినట్లు సెబీ గుర్తించింది. దాదాపు 21 ట్రాన్సాక్షన్ల ద్వారా పెద్ద మొత్తాలు సంపాదించినట్లు కూడా నిర్ధారించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సెబీ విచారణ కొనసాగిస్తోంది.
వివరాలు
స్టాక్‌మార్కెట్ల చరిత్రలో ఇంత పెద్ద మొత్తాన్ని జరిమానాగా విధించడం ఇదే తొలిసారి
ఈ వ్యవహారంలో జేన్ స్ట్రీట్ సంస్థ రూ.4,843 కోట్లను జరిమానా చెల్లించాలని సెబీ ఆదేశించింది. దేశీయ స్టాక్‌మార్కెట్ల చరిత్రలో ఇంత పెద్ద మొత్తాన్ని జరిమానాగా విధించడం ఇదే తొలిసారి. ఈ జరిమానా జేన్ స్ట్రీట్ గ్రూప్ అనుబంధ సంస్థలైన జేఎస్‌ఐ ఇన్వెస్ట్‌మెంట్స్, జేఎస్‌ఐ2 ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, జేన్ స్ట్రీట్ ఏషియా ట్రేడింగ్‌లకు వర్తిస్తుంది.