Jio IPO: టాప్-5 మెగా ఐపీఓల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌దే పైచేయి.. ఇన్వెస్టర్లకు అదిరే లాభాలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని అతిపెద్ద ఐదు ఐపీఓలతో పోలిస్తే జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ఇన్వెస్టర్లకు అత్యధిక రాబడిని అందించింది. షేర్లు స్టాక్ మార్కెట్‌లో 21శాతానికి పైగా ప్రీమియంతో లిస్ట్ కావడంతో కేటాయింపులు పొందిన మదుపరులు లాభాలు ఆర్జించారు. ఒక్కో షేరు రూ.1,358 ధరతో లిస్ట్ కావడంతో షేర్‌హోల్డర్ల కేటగిరీలో కనీసం 23 షేర్లు పొందిన వారికి రూ.5,497 లాభం వచ్చినట్లు అంచనా. రిటైల్ ఇన్వెస్టర్లకు 12 షేర్ల లాట్‌పై రూ.2,868 లాభం వచ్చింది. ఇదే సమయంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ), హ్యుందాయ్ మోటార్ ఇండియా, పేటీయం ఐపీఓల షేర్లు డిస్కౌంట్‌తో లిస్ట్ అయ్యాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) షేర్లు మాత్రం కేవలం ఒక శాతం ప్రీమియంతో మార్కెట్‌లో నమోదయ్యాయి.
వివరాలు
ఐపీఓకు రికార్డు స్థాయిలో స్పందన
ఈ నేపథ్యంలో జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ మంచి రాబడిని అందించిన పబ్లిక్ ఇష్యూగా నిలిచింది.
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓలో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన రూ.8,110 కోట్ల విలువైన షేర్లపై భారీ ఆసక్తి కనిపించింది.
సంస్థాగత మదుపరుల నుంచి రూ.2.5 లక్షల కోట్లకు పైగా బిడ్లు వచ్చాయి. ఇది ఆఫర్ చేసిన మొత్తానికి 30 రెట్లకుపైగా కావడం విశేషం.
మొత్తంగా ఐపీఓ 22.19 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. అర్హత కలిగిన సంస్థాగత మదుపరుల (క్యూఐబీ) విభాగానికి కేటాయించిన షేర్ల కోసం 70.55 రెట్ల బిడ్లు వచ్చాయి.
ఈ గణాంకాలు ఐపీఓపై సంస్థాగత ఇన్వెస్టర్లు చూపిన ఆసక్తిని తెలియజేస్తున్నాయి.
వివరాలు
జియోపై ఇన్వెస్టర్ల నమ్మకం పెరిగింది: ఆకాశ్ అంబానీ
జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ.. ఐపీఓకు వచ్చిన స్పందన తమ అంచనాలను మించిపోయిందని తెలిపారు.
ఇన్వెస్టర్ల నుంచి అన్ని విభాగాల్లోనూ రికార్డు స్థాయిలో స్పందన వచ్చిందన్నారు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓ ప్రారంభమైన 95 నిమిషాల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిందని చెప్పారు.
ఇది భారత మార్కెట్‌లో అత్యంత వేగంగా పూర్తయిన సబ్‌స్క్రిప్షన్లలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ ఐపీఓకు రూ.7.5 లక్షల కోట్లకు పైగా విలువైన బిడ్లు వచ్చాయని, 1.3 కోట్లకు పైగా దరఖాస్తులు అందాయని ఆకాశ్ అంబానీ వెల్లడించారు.
స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడం సంస్థకు కొత్త దశకు నాంది అని ఆయన అభివర్ణించారు. పబ్లిక్ ఇష్యూ తర్వాత వాటాదారుల పట్ల సంస్థ బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.
వివరాలు
540 మిలియన్లకు పైగా కస్టమర్లకు జియో సేవలు
ఇన్వెస్టర్ల సంపదను కాపాడటంతో పాటు దీర్ఘకాలంలో దాని విలువను పెంచడం తమ బాధ్యత అని ఆకాశ్ అంబానీ అన్నారు.
కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడం ద్వారా సంస్థ స్థిరమైన వృద్ధిని సాధించగలదని వివరించారు.
డిజిటల్ సేవలను మరింత విస్తరించడం,వినియోగదారులకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడం,ఇన్వెస్టర్లకు దీర్ఘకాలిక రాబడిని అందించడం తమ ప్రాధాన్యాలని పేర్కొన్నారు.
జియో అభివృద్ధి చేసిన డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా 540 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటికే ఉన్న డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తూ, భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.
వృద్ధి, నాణ్యత, విశ్వసనీయత విషయంలో జియోను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
వివరాలు
రిలయన్స్ గ్రూప్‌కు మరింత బలం
జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు మరో కీలక మైలురాయిగా నిలిచింది.
ఈలిస్టింగ్‌తో రిలయన్స్ దేశంలో అత్యంత విలువైన వ్యాపార సమూహంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.
మరోవైపు మార్కెట్ విలువ పరంగా జియో ప్లాట్‌ఫామ్స్ భారతి ఎయిర్‌టెల్‌ను అధిగమించి దేశంలోనే అత్యంత విలువైన టెలికాం సంస్థగా అవతరించింది.
ఈసందర్భంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
అంబానీ కుటుంబ సభ్యులు,సంస్థ సీనియర్ అధికారులు గాంగ్ మోగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
భారీ ఐపీఓ విజయవంతం కావడంతో జియో ప్లాట్‌ఫామ్స్ దేశంలోని అతిపెద్ద లిస్టెడ్ సంస్థల సరసన చేరింది.
భవిష్యత్తులో సంస్థ సాధించే వృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశాన్ని ఈ ఐపీఓ ఇన్వెస్టర్లకు కల్పించింది.