Page Loader
అలీబాబాకు కొత్త ఛైర్మన్, సీఈఓ నియామకం.. షేర్ల పతనం, పోస్ట్ కొవిడ్ నష్టాలే కారణం
అలీబాబా కొత్త ఛైర్మన్‌గా జోసెఫ్ సాయ్

అలీబాబాకు కొత్త ఛైర్మన్, సీఈఓ నియామకం.. షేర్ల పతనం, పోస్ట్ కొవిడ్ నష్టాలే కారణం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 20, 2023
01:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాకు చెందిన అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అలీబాబా గ్రూపులో అనూహ్య మార్పులు జరిగాయి. గత 8 ఏళ్ల నుంచి గ్రూప్ ఛైర్మన్‌గా డేనియల్‌ ఝాంగ్‌ వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుత ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ జోసెఫ్‌ సాయ్‌ కొత్త ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. టావోబావో, మాల్‌ ఆన్‌లైన్‌ విభాగాలకు ఛైర్మన్‌గా ఉన్న ఎడ్డీవూ గ్రూపు సీఈఓగా చార్జ్ తీసుకోనున్నారు. ఓ వైపు షేర్ల పతనం, మరోవైపు కొవిడ్‌ తర్వాత ఎదురవుతున్న నష్టాలతో లీడర్ షిప్ మార్పు అనివార్యమైంది. అయితే 2020 నుంచే సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. జాక్‌ మా తో పాటు ఆయనకు చెందిన యాంట్‌ గ్రూప్‌పై చైనా ప్రభుత్వం పలు ఆంక్షలు పెట్టింది. దీంతో అలీబాబా పతనానికి దారి తీసినట్లైంది.

DETAILS

క్లౌడ్‌ బిజినెస్‌కు మాత్రం ఝాంగ్‌ నేతృత్వం యథాతథం : అలీబాబా

క్లౌడ్ కంప్యూటింగ్‌ నుంచి లాజిస్టిక్స్‌ వరకు, అంతర్జాతీయ వాణిజ్యంలో కంపెనీని బలంగా తీర్చిదిద్దనున్నట్లు అలీబాబా కంపెనీ ఇటీవలే వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే 6 మార్గాల్లో పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను అమలు చేస్తామని వివరించింది. 2015లో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఝాంగ్‌, కీలక సమయంలో బాధ్యతల నుంచి తప్పుకోవడం కీలక పరిణామంగా మారనుంది. అయితే క్లౌడ్‌ బిజినెస్‌కు మాత్రం ఝాంగ్‌ నేతృత్వమే యథాతథంగా కొనసాగుతుందని అలీబాబా గ్రూప్ స్పష్టతనిచ్చింది. కంపెనీ ఆన్‌లైన్‌, ఫిజికల్ స్టోర్లను కలుపుతూ ప్రస్తుత ఛైర్మన్ తెచ్చిన కొత్త రిటైల్‌ వ్యాపార నమూనా మంచి విజయాన్నే సాధించింది. ఫలితంగా మాల్స్‌, సూపర్‌ మార్కెట్ల విభాగంలో అలీబాబా టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది. దీంతో చైనాలోనే అత్యంత విలువైన కంపెనీగా అలీబాబా చరిత్రకెక్కింది.