LOADING...
Adani: అదానీ కేసుల్లో కీలక మలుపు.. కేసు ఉపసంహరణ దిశగా దర్యాప్తు
అదానీ కేసుల్లో కీలక మలుపు.. కేసు ఉపసంహరణ దిశగా దర్యాప్తు

Adani: అదానీ కేసుల్లో కీలక మలుపు.. కేసు ఉపసంహరణ దిశగా దర్యాప్తు

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2026
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీపై అమెరికాలో కొనసాగుతున్న పలు కేసులు ఇప్పుడు పరిష్కారం దిశగా వెళ్తున్నాయి. ఇప్పటికే ఒక సివిల్‌ కేసును యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) వద్ద సెటిల్‌ చేసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో న్యాయ విభాగం (డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌ - డీఓజే), ఆర్థిక శాఖ కూడా తమ సమాంతర దర్యాప్తులను రాబోయే రోజుల్లో ముగించనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లోని సౌర ఇంధన ప్రాజెక్టులకు సంబంధించి, అమెరికా ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై గౌతమ్‌ అదానీతో పాటు ఆయన సోదరుడి కుమారుడు సాగర్‌ అదానీపై యూఎస్‌ ఎస్‌ఈసీ గురువారం సెటిల్‌మెంట్‌ చేసుకుంది.

వివరాలు

యూఎస్ బ్యాంకుల నుంచి నిధుల సమీకరణ

ఈ ఒప్పందం ప్రకారం, తప్పు చేసినట్లు అంగీకరించకుండా లేదా ఖండించకుండా గౌతమ్‌ అదానీ 6 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.57 కోట్లు), సాగర్‌ అదానీ 12 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.114 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించినట్లు కోర్టు రికార్డులు పేర్కొంటున్నాయి. అదే సమయంలో వీరిద్దరిపై ఉన్న క్రిమినల్‌ ఆరోపణలను ఉపసంహరించుకోవడానికి యూఎస్‌ న్యాయ విభాగం (డీఓజే) సిద్ధమవుతున్నట్లు సమాచారం. 2024 నవంబరులో నమోదైన ఆరోపణల ప్రకారం, భారత్‌లో సౌర విద్యుత్‌ కాంట్రాక్టులు పొందేందుకు కొందరు ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్‌ డాలర్లు (అప్పటి మారకపు విలువ ప్రకారం సుమారు రూ.2029 కోట్లు) లంచంగా ఇచ్చారని, ఆ నిధులను అమెరికా ఇన్వెస్టర్లు, బ్యాంకుల నుంచి సమీకరించారన్నది ప్రధాన ఆరోపణ.

వివరాలు

ఆరోపణలను ఖండించిన అదాన్ గ్రూప్

ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ పూర్తిగా ఖండిస్తూ వచ్చింది. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, బలమైన పాలన ప్రమాణాలు, నియమ నిబంధనలను పాటిస్తున్నామని సంస్థ స్పష్టం చేసింది. అలాగే లంచం ఆరోపణలకు సంబంధించి ఎటువంటి విశ్వసనీయ ఆధారాలు లేవని అదానీ తరఫు న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. ఇక ఇరాన్‌పై విధించిన ఆంక్షలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై అమెరికాలో కొనసాగుతున్న మరో దర్యాప్తు కూడా పరిష్కారం దిశగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ అన్ని కేసులు ఒక కొలిక్కి వస్తే అదానీ గ్రూప్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న న్యాయపరమైన చిక్కులు చాలావరకు తొలగినట్లేనని భావిస్తున్నారు.

Advertisement