LOADING...
IPO calendar: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, టాటా క్యాపిటల్‌ ఐపీఓలు వచ్చేవారమే ప్రారంభం
ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, టాటా క్యాపిటల్‌ ఐపీఓలు వచ్చేవారమే ప్రారంభం

IPO calendar: ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌, టాటా క్యాపిటల్‌ ఐపీఓలు వచ్చేవారమే ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ప్రైమరీ మార్కెట్‌ వచ్చే వారం పెట్టుబడిదారుల ఉత్సాహంతో కళకళలాడనుంది. ఐదు పబ్లిక్‌ ఇష్యూల ద్వారా మొత్తం రూ.28,500 కోట్లు సమీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో టాటా క్యాపిటల్‌, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా అనే రెండు బిగ్‌ ఐపీఓలు ఉండటం విశేషం. సాధారణంగా ఒకే వారంలో ఇంత పెద్ద స్థాయి ఐపీఓలు రావడం అరుదు. ఈసారి రెండు ప్రముఖ సంస్థలు ఒకేసారి సబ్‌స్క్రిప్షన్‌కు రావడం మదుపర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

Details

టాటా క్యాపిటల్‌ ఐపీఓ 

టాటా గ్రూప్‌కు చెందిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ టాటా క్యాపిటల్‌ పబ్లిక్‌ ఇష్యూ అక్టోబర్‌ 6న ప్రారంభమై 8న ముగియనుంది. రూ.15,512 కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించనుంది. ఒక్కో షేరు ధర శ్రేణి రూ.310-326గా నిర్ణయించబడింది. ఇది ఈ ఏడాది వస్తున్న అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా గుర్తించబడుతోంది. టాటా గ్రూప్‌ నమ్మకం, బలమైన రిటైల్‌, కార్పొరేట్‌ పోర్ట్‌ఫోలియో కారణంగా దీనిపై మదుపర్లు ఆసక్తి చూపుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Details

 ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా ఐపీఓ 

దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ అనుబంధ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా దేశీయ కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ రంగంలో అతిపెద్ద వాటా కలిగి ఉంది. దీని పబ్లిక్‌ ఇష్యూ అక్టోబర్‌ 7న ప్రారంభమై 9న ముగియనుంది. మొత్తం రూ.11,607 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరు ధర శ్రేణి రూ.1,080-1,140గా నిర్ణయించింది. రూబికాన్‌ రీసెర్చ్‌ ఐపీఓ ఫార్మాస్యూటికల్‌ రంగానికి చెందిన రూబికాన్‌ రీసెర్చ్‌ రూ.1,377 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్‌ ఇష్యూతో రానుంది. అక్టోబర్‌ 9న సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభమై 13న ముగియనుంది. ఒక్కో షేరు ధర శ్రేణి రూ.461-481గా నిర్ణయించారు.

Details

అనంతమ్‌ హైవేస్‌ ఇన్విట్‌ 

మెయిన్‌బోర్డు విభాగంలో అనంతమ్‌ హైవేస్‌ ఇన్విట్‌ కూడా రూ.400 కోట్ల పబ్లిక్‌ ఇష్యూతో వస్తోంది. అక్టోబర్‌ 7న ప్రారంభమై 9న ముగియనుంది. మిట్టల్‌ సెక్షన్స్‌ (SME IPO) ఎస్‌ఎంఈ విభాగంలో స్టీల్‌ ఉత్పత్తి సంస్థ మిట్టల్‌ సెక్షన్స్‌ రూ.53 కోట్లు సమీకరించనుంది. ఈ ఇష్యూ అక్టోబర్‌ 7న ప్రారంభమై 9న ముగియనుంది. ఒక్కో షేరు ధర శ్రేణి రూ.136-143గా నిర్ణయించారు. మొత్తం మీద.. నాలుగు మెయిన్‌బోర్డు ఐపీఓలు, ఒక SME ఐపీఓతో కలిపి వచ్చే వారం ప్రైమరీ మార్కెట్‌లో భారీ స్థాయి పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయి.