LIC: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో అన్‌క్లెయిమ్ చేయని మెచ్యూరిటీ రూ.880 కోట్లు
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)లో మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్ చేసుకోని బీమా పరిహార నిధులు రూ.880.93 కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వివరాల ప్రకారం, బీమా ప్రయోజనాలు క్లెయిమ్ చేసుకోని పాలసీదార్లు మొత్తం 3,72,282 మంది ఉన్నారని లోక్‌సభలో వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం 2022-23లో 3,73,329 మంది పాలసీదార్లకు సంబంధించిన రూ.815.04 కోట్ల నిధులు కూడా అన్‌క్లెయిమ్డ్‌గా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. అన్‌క్లెయిమ్డ్,అవుట్‌స్టాండింగ్ క్లెయిమ్‌లను తగ్గించడానికి ఎల్‌ఐసీ వివిధ చర్యలు చేపట్టుతోంది.
క్లెయిమ్‌లను తగ్గించుకునేందుకు ఎల్‌ఐసీ ప్రయాత్నాలు
పత్రికలు, డిజిటల్ మాధ్యమాలు, రేడియో వంటి విధానాల ద్వారా ప్రకటనలు ఇచ్చి క్లెయిమ్ చేసుకోవాల్సిన సమాచారాన్ని అందిస్తోంది. అలాగే, సాధారణ లేదా స్పీడ్ పోస్ట్, ఇ-మెయిల్ చిరునామాలు, మొబైల్ నంబర్ల ద్వారా కూడా సంబంధిత వ్యక్తులకు సమాచారం పంపిస్తున్నట్లు తెలిపారు. బీమా క్లెయిమ్ చేసుకోవాలంటూ పాలసీదారులకు ఎల్‌ఐసీ ఏజెంట్ల ద్వారా సమాచారం చేరవేస్తున్నట్లు కూడా మంత్రి వెల్లడించారు.