Mahadev betting app: మహాదేవ్ బెట్టింగ్ యాప్ సూత్రధారి సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో అరెస్ట్
గత ఏడాది ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెలుగులోకి వచ్చిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev Betting App) కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ (Sourabh Chandrakar)ను దుబాయ్‌లో ఇటీవల అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అతన్ని త్వరలో భారత్‌కు తీసుకురానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామంలో, ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ (Interpol) రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. చంద్రకర్‌తో పాటు మరో యాప్ ప్రమోటర్ రవి ఉప్పల్‌ను కూడా గత ఏడాది దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నారని ఈడీ పేర్కొంది.
వివాహానికి ₹200 కోట్లు ఖర్చు
మహాదేవ్ ఆన్‌లైన్ బుక్ (MOB) గేమింగ్, బెట్టింగ్ యాప్‌లో చంద్రకర్, రవిలు చత్తీస్‌గఢ్‌కు చెందిన ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, అధికారులతో సంబంధాలు కలిగి ఉన్నారని ఈడీ తన దర్యాప్తులో పేర్కొంది. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ 2022లో యూఏఈలో వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి దాదాపు ₹200 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.హాజరైన అతిథులకు ప్రత్యేకంగా ప్రైవేటు జెట్ ఏర్పాటు చేశాడు. వివాహం కోసం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి రూ.112 కోట్లు హవాలా మార్గంలో చెల్లించారట.
ఏంటీ మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం..?
హోటల్ గదుల కోసం రూ.42 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. బాలీవుడ్ సెలబ్రిటీలతో నిర్వహించిన పార్టీల కోసం కూడా హవాలా మార్గంలోనే డబ్బులు చెల్లించారని ఈడీ వెల్లడించింది. ఎఫ్‌ఐఆర్ ప్రకారం, మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు ₹15,000 కోట్ల అవినీతి జరిగింది. ఈ యాప్ ద్వారా 67 బెట్టింగ్ వెబ్‌సైట్లు మరియు యాప్‌లు సృష్టించబడినట్లు గుర్తించారు. వీటిలో క్రికెట్, ఫుట్‌బాల్, తీన్ పత్తీ వంటి ఆటల్లో బెట్టింగ్ నిర్వహించేవారు. సామాన్యులను ఆకర్షించేందుకు సెలబ్రిటీలను ప్రమోషన్ల కోసం ఉపయోగించారు. 2023 నవంబరులో సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్ ఫిర్యాదు చేయడంతో, ముంబై మాతుంగ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు.