LOADING...
Mahindra and mahindra: జీవిత బీమా వ్యాపారంలోకి మహీంద్రా ఎంట్రీ.. మనులైఫ్‌తో భారీ భాగస్వామ్యం
జీవిత బీమా వ్యాపారంలోకి మహీంద్రా ఎంట్రీ.. మనులైఫ్‌తో భారీ భాగస్వామ్యం

Mahindra and mahindra: జీవిత బీమా వ్యాపారంలోకి మహీంద్రా ఎంట్రీ.. మనులైఫ్‌తో భారీ భాగస్వామ్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

బీమా రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా అధికారికంగా ప్రకటించింది. ఇందుకోసం కెనడాలోని టొరొంటోలో ప్రధాన కార్యాలయం కలిగిన మనులైఫ్‌తో కలిసి 50:50 వాటాలతో సంయుక్త సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ భాగస్వామ్యంతో రెండు సంస్థలు మొదటగా రూ.7,200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. రాబోయే పది సంవత్సరాల్లో రూ.18,000 నుండి రూ.30,000 కోట్ల మధ్య విలువ కలిగిన వ్యాపారాన్ని నిర్మించడమే లక్ష్యమని మహీంద్రా గ్రూప్ సీఈఓ, ఎండీ అనీష్ షా వెల్లడించారు. సంయుక్త సంస్థను దేశంలోని గ్రామీణ మరియు పాక్షిక పట్టణ ప్రాంతాల్లో అగ్రగామి జీవిత బీమా సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, అలాగే పట్టణాలు మరియు మెట్రో నగరాల్లోనూ శక్తివంతమైన స్థితిని సాధించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Details

త్వరలో లైసెన్స్ దరఖాస్తు

బీమా నియంత్రణ సంస్థ నుండి లైసెన్స్ కోసం మరో 2-3 నెలల్లో దరఖాస్తు చేసుకోనున్నట్టు తెలియజేశారు. సంయుక్త సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యే వరకు 15-18 నెలలు పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొత్తం పెట్టుబడి కింద రెండు సంస్థలు చెరో రూ.3,600 కోట్లు (400 మిలియన్ డాలర్లు) చొప్పిస్తాయి. వీటిలో మొదటి ఐదు సంవత్సరాల్లో చెరో రూ.1,250 కోట్లు (140 మిలియన్ డాలర్లు) పెట్టనున్నట్లు వివరించారు. సాధారణంగా ఇలాంటి కొత్త వెంచర్లకు బ్రేక్‌-ఈవెన్‌ చేరుకోవడానికి 10-12 సంవత్సరాలు పడుతాయని షా అన్నారు.

Details

మనులైఫ్ ప్రొఫైల్

ప్రస్తుతం మనులైఫ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌లలో 37,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1,09,000 మంది ఏజెంట్లు మరియు వేలాది పంపిణీ భాగస్వాములతో ఈ సంస్థ విస్తృతమైన నెట్‌వర్క్‌ను కొనసాగిస్తోంది. కెనడా, ఆసియా, యూరోప్, అమెరికా ప్రాంతాల్లో సుమారు 3.6 కోట్ల మంది ఖాతాదారులకు సేవలు అందిస్తోంది. బీమా మార్కెట్లో వృద్ధి భారత జీవిత బీమా రంగంలో కొత్త వ్యాపార ప్రీమియాలు గత ఐదేళ్లలో 12% వార్షిక సమ్మిళిత వృద్ధి రేటుతో (CAGR) 20 బిలియన్ డాలర్లను (సుమారు రూ.1.77 లక్షల కోట్లు) దాటి గణనీయమైన పురోగతి సాధించాయి.