Page Loader
EPFO 3.0: ఈపీఎఫ్‌ఓ 3.0 వచ్చేస్తోంది.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ
EPFO 3.0: ఈపీఎఫ్‌ఓ 3.0 వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

EPFO 3.0: ఈపీఎఫ్‌ఓ 3.0 వచ్చేస్తోంది.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
09:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) డిజిటల్ రంగంలో పెద్ద ఎత్తున మార్పులను చేపట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈపీఎఫ్‌ఓ 3.0 పేరుతో తీసుకురానున్న కొత్త వెర్షన్‌ ద్వారా సుమారు 9 కోట్ల మంది సభ్యులకు మెరుగైన సేవలు లభించనున్నాయని తెలిపారు. మే లేదా జూన్‌ నాటికి ఈ తాజా వెర్షన్‌ అందుబాటులోకి రానుందని చెప్పారు. ఈ సందర్భంగా 'పీటీఐ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక కీలక విషయాలను వెల్లడించారు. ఈపీఎఫ్‌ఓ వెర్షన్‌ 3.0 ద్వారా సేవలను మరింత సులభతరం చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆటోమేటెడ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్లు,డిజిటల్ సవరణలు,ఏటీఎం ద్వారా నిధుల ఉపసంహరణ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో భాగమవుతాయని వివరించారు.

వివరాలు 

ఈపీఎఫ్‌ఓ దగ్గర రూ.27 లక్షల కోట్ల విలువైన నిధులు

ఈపీఎఫ్‌ఓ వ్యవస్థను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా, సౌకర్యవంతంగా మార్చడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు క్లెయిమ్‌లు, సవరణల కోసం ఫారాలు పూరించడం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి సమస్యలు ఉండగా, కొత్త వెర్షన్‌తో ఇవన్నీ తొలగిపోతాయని చెప్పారు. వేగంగా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ జరగడం వల్ల సభ్యుల ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ కాబోతున్నాయని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ దగ్గర రూ.27 లక్షల కోట్ల విలువైన నిధులు నిల్వగా ఉన్నాయని, వీటికి కేంద్ర ప్రభుత్వం హామీతో పాటు సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ అందిస్తోందని తెలిపారు.

వివరాలు 

 78 లక్షల మందికి లాభం 

ఇంతకుముందే కేంద్రం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకురావడంతో, దేశంలోని ఏ బ్యాంక్‌ ద్వారా అయినా పెన్షన్ పొందే అవకాశాన్ని కల్పించామన్నారు. దీని వలన 78 లక్షల మందికి లాభం చేకూరిందని తెలిపారు. అంతేకాదు, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్‌ధన్ యోజన వంటి వివిధ పెన్షన్ పథకాలను ఏకీకృతం చేసి, పెన్షన్ వ్యవస్థను మరింత స్థిరంగా, విస్తృతంగా మార్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చిస్తున్నదని మాండవీయ వెల్లడించారు.