
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 176 పాయింట్లు డౌన్ అయిన సెన్సెక్స్ ..
ఈ వార్తాకథనం ఏంటి
బుధవారం రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ సూచీ 25,500 పాయింట్ల దిగువకు పడిపోయింది. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చి ఉండటంతో, మార్కెట్లు ఉదయం నుంచే నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రోజంతా మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. చివరి ట్రేడింగ్ సెషన్‌లో భారీగా అమ్మకాలు జరగడంతో మార్కెట్లు మరింత క్షీణించాయి. గత సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,625.89 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఈ సూచీ కనిష్టంగా 83,382.28 పాయింట్లను తాకగా, గరిష్టంగా 83,781.36 పాయింట్ల వరకు చేరింది. చివరికి 176.43 పాయింట్లు నష్టపోయి 83,536.08 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 46.40 పాయింట్లు తగ్గి 25,476.10 వద్ద ముగిసింది.
వివరాలు
స్మాల్‌క్యాప్ సూచీ 0.5 శాతం పెరిగింది
ఈరోజు ట్రేడింగ్‌లో సుమారు 1,973 షేర్లు లాభపడగా,1,888 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో టాటా స్టీల్,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,హిందాల్కో ఇండస్ట్రీస్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా లాంటి షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఇకపోతే, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, కోల్ ఇండియా లాంటి కంపెనీలు లాభపడినవిగా నిలిచాయి. రంగాలవారీగా పరిశీలిస్తే, మెటల్, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ సూచీలు ఒక్కొక్కటిగా సుమారు 1.4 శాతం నష్టపోయాయి. మీడియా, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు సుమారు 0.5 శాతం మేర తగ్గగా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు 0.3 శాతం నుండి 0.8 శాతం వరకు పెరిగాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ సూచీ స్థిరంగా ఉండగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.5 శాతం పెరిగింది.