LOADING...
Stock market: చమురు ధరలు తగ్గడంతో మార్కెట్లకు ఊపు.. సెన్సెక్స్‌ 640 పాయింట్లు జంప్
చమురు ధరలు తగ్గడంతో మార్కెట్లకు ఊపు.. సెన్సెక్స్‌ 640 పాయింట్లు జంప్

Stock market: చమురు ధరలు తగ్గడంతో మార్కెట్లకు ఊపు.. సెన్సెక్స్‌ 640 పాయింట్లు జంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 10, 2026
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండు రోజులుగా నమోదైన భారీ నష్టాల నుంచి కోలుకుని లాభాల బాట పట్టాయి. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధానికి త్వరలో ముగింపు పలుకుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మదుపర్లకు ఊరటనిచ్చాయి. దీనికి తోడు చమురు సరఫరాలో అంతరాయం కలగకుండా ఆంక్షలను సడలించే చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొనడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. దీంతో నిన్న బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ట్రేడైన ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గి 90 డాలర్ల దిగువకు వచ్చాయి. ఈ పరిణామం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా ఉత్సాహంగా రాణించాయి.

Details

మంచి వృద్ధిని నమోదు చేసిన నిఫ్టీ సూచీ

ఈ నేపథ్యంలో ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్ల వరకు లాభపడగా, నిఫ్టీ సూచీ 24,200 మార్కును దాటింది. సెన్సెక్స్ ఉదయం 78,375.73 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 77,566.16) లాభాలతో ప్రారంభమైంది. రోజంతా పాజిటివ్ ట్రెండ్‌లో కొనసాగిన ఈ సూచీ ఇంట్రాడేలో 78,526.25 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 639.82 పాయింట్ల లాభంతో 78,205.98 వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ సూచీ కూడా మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ సూచీ 233.55 పాయింట్లు పెరిగి 24,261.60 వద్ద స్థిరపడింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.83గా నమోదైంది.

Details

నష్టాల్లో రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్ షేర్లు

సెన్సెక్స్‌లోని 30 ప్రధాన షేర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండిగో, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు ఎటర్నల్, ఇన్ఫోసిస్, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 91.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర కూడా స్థిరంగా ఉండి ఔన్సుకు 5,176.72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో పెట్టుబడిదారుల నమ్మకం కొంత మేరకు పునరుద్ధరించబడినట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement