Page Loader
Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గటంతో లాభాలతో మొదలైన మార్కెట్లు! 
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గటంతో లాభాలతో మొదలైన మార్కెట్లు!

Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు తగ్గటంతో లాభాలతో మొదలైన మార్కెట్లు! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 25, 2025
10:05 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం శాంతించడం డాలాల్ స్ట్రీట్‌కి ఉత్సాహాన్ని నింపింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సానుకూల సంకేతాలు కూడా సూచీల సెంటిమెంట్‌ బలపరుస్తున్నాయి. ఈ ప్రభావంతో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లకుపైగా ఎగసింది. నిఫ్టీ మళ్లీ 25,100 మార్క్‌ను అధిగమించింది. ఉదయం 9.25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 458.84 పాయింట్లు లాభపడి 82,513.95 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 129 పాయింట్లు లాభంతో 25,173.45 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి మారక విలువ 5 పైసలు పెరిగి 86.00గా ఉంది.

Details

మిశ్రమంగా ఆసియా-పసిఫిక్ మార్కెట్లు

నిఫ్టీలో టైటాన్ కంపెనీ, ఎన్టీపీసీ, ట్రెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు రాణిస్తుండగా, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికి వస్తే, వడ్డీ రేట్ల కోతపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన వ్యాఖ్యల ప్రభావంతో పాటు, పశ్చిమాసియాలోని పరిణామాలపై మదుపర్లు దృష్టి సారించారు. దీంతో ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మిశ్రమంగా కదులుతున్నాయి.

Details

లాభాల్లో అమెరికా మార్కెట్లు

జపాన్ నిక్కీ 0.11 శాతం, దక్షిణ కొరియా కోస్పి 0.31 శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 0.66 శాతం లాభాల్లో పయనిస్తుండగా, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ మాత్రం ఫ్లాట్‌గా కొనసాగుతోంది. అమెరికా మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. డోజోన్స్ 1.19 శాతం, ఎస్‌అండ్‌పీ 500 సూచీ 1.11 శాతం, నాస్‌డాక్ 1.43 శాతం మేర పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ తీరు ఎలా మారుతుందో పరిశీలించిన తర్వాతే కీలక రేట్ల కోతపై నిర్ణయం తీసుకుంటామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టం చేశారు. తక్షణమే రేట్ల కోత విధించాలంటున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆదేశాలకు పావెల్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని గమనించాలి.