Byjus: బైజూస్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 3500 మంది ఉద్యోగులు ఇంటికి?
ప్రముఖ దేశీయ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్, భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. దాదాపు 3500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. బైజూస్ సంస్థ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. బైజూస్ ఇండియాకు ఇటీవలే కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ బాధ్యతలను స్వీకరించాడు. పునర్‌వ్యవస్థీకరణకు ప్రణాళికలో భాగంగా 3500 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కోవిడ్ విజృంభించిన నేపథ్యంలో బైజూస్ కంపెనీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది. అప్పట్లో లాభసాటిగానే ఉన్న సంస్థ, కోవిడ్ సమస్య తగ్గుముఖం పట్టడంతో లాభాలు పూర్తిగా క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేసింది.
ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విభాగాల్లో ఒకే స్టాఫ్
ప్రస్తుతం బైజూస్‌లో ఉన్న చాలా విభాగాలను విలీనం చేసి సరికొత్త టీమ్‌లను ఏర్పాటు చేసేందుకు అర్హున్ మోహన్ ప్రణాళిక సిద్ధం చేశారట. మరోవైపు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విభాగాల్లో ఒకే స్టాఫ్‌ను ఉంచాలని బైజూస్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే అనుబంధ సంస్థగా ఉన్న 'ఆకాశ్' సహా విదేశీ వ్యాపారాల్లో ఎలాంటి తొలగింపులు ఉండవని తెలుస్తోంది. బైజూస్ లో 2021లో అత్యధికంగా 52వేల మంది ఉద్యోగులు పనిచేశారు. ప్రస్తుతం ఆ సంఖ్య్ 35వేలకు చేరినట్లు సమాచారం. ఈ ఏడాది ఇప్పటికే పలుసార్లు బైజూస్ సంస్థ ఉద్యోగులను తొలగించింది.