Medical Shops: మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. ఆన్‌లైన్ మందుల విక్రయాలపై కెమిస్టుల ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఈ నెల 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) పిలుపుతో సుమారు 12.4 లక్షలకు పైగా మెడికల్ దుకాణాలు మూతపడనున్నాయి. ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయాలు పెరగడం, భారీ తగ్గింపు ధరలతో అమ్మకాలు జరగడం వల్ల సంప్రదాయ మెడికల్ దుకాణాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని కెమిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల మద్దతుతో నడుస్తున్న ఈ-ఫార్మసీలు తక్కువ ధరలకు మందులు విక్రయించడం వల్ల చిన్న స్థాయి వ్యాపారులు పోటీలో నిలబడలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వారు చెబుతున్నారు. నియంత్రణ లేకుండా ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు సాగుతున్నాయని, వైద్యుల చీటీలు దుర్వినియోగం అవుతున్నాయని ఏఐఓసీడీ ఆరోపించింది.
వివరాలు
బంద్‌లో కెమిస్టులతో పాటు ఔషధ పంపిణీదారులు
ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రకటించింది. ఈ బంద్ కారణంగా సాధారణ మందుల కొనుగోలు సేవలు ఒకరోజు పాటు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే ఆసుపత్రులకు అనుబంధంగా పనిచేసే అత్యవసర మెడికల్ షాపులు తెరిచి ఉండొచ్చని సమాచారం. ప్రజలు అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని ఏఐఓసీడీ సూచించింది. ఈ బంద్‌లో కెమిస్టులతో పాటు ఔషధ పంపిణీదారులు కూడా పాల్గొననున్నారు. ఆన్‌లైన్ మందుల విక్రయాలపై కట్టుదిట్టమైన నియంత్రణలు తీసుకురావాలని ఏఐఓసీడీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. కార్పొరేట్ సంస్థలు ఇస్తున్న అధిక తగ్గింపులను నియంత్రించాలని, ఔషధ ధరల నియంత్రణ సంస్థ నిబంధనల ప్రకారం మాత్రమే మందుల విక్రయాలు జరగాలని డిమాండ్ చేసింది.
వివరాలు
కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు వెళ్ళినప్పటికీ, సరైన చర్యలు తీసుకోలేదు: ఏఐఓసీడీ
కొవిడ్ సమయంలో రోగులకు ఇంటివద్దకే మందులు అందించే సేవలు ప్రారంభమయ్యాయని, ఇప్పుడు వాటిని నిలిపివేయాల్సిన అవసరం ఉందని సంఘం అభిప్రాయపడింది. ఈ అంశంపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు పంపించినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ.. అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. నిజమైన అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అత్యవసర మందులు అందించాలని సూచించారు.
వివరాలు
బంద్ సమయంలో బలవంతపు మూసివేతలు, బెదిరింపులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నివారించాలి
రోగులు, ప్రజలు, అధికారులు లేదా ఇతర సంస్థలతో ఎలాంటి ఘర్షణలకు దిగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. బంద్ సమయంలో బలవంతపు దుకాణాల మూసివేతలు, బెదిరింపులు లేదా చట్టవిరుద్ధ చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. అంబులెన్సులు, అత్యవసర మందుల వాహనాలు, వైద్య సిబ్బంది రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.