Page Loader
Microsoft: మిగిలిన ఉద్యోగులు AI నైపుణ్యాలలో దృష్టి సారించండి: మైక్రోసాఫ్ట్ 
మిగిలిన ఉద్యోగులు AI నైపుణ్యాలలో దృష్టి సారించండి: మైక్రోసాఫ్ట్

Microsoft: మిగిలిన ఉద్యోగులు AI నైపుణ్యాలలో దృష్టి సారించండి: మైక్రోసాఫ్ట్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

భారీ స్థాయి ఉద్యోగాల తొలగింపుల అనంతరం మైక్రోసాఫ్ట్ మిగిలిన ఉద్యోగులకు ఒక స్పష్టమైన, కఠినమైన సందేశాన్ని పంపింది. ఉద్యోగులు కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెట్టాలని కంపెనీ సూచించింది. ఇప్పటికే వివిధ విభాగాల్లో 15,000 మందికిపైగా ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. 2025లో ఇప్పటివరకు నాలుగు విడతల్లో ఉద్యోగుల తొలగింపు జరిగిందని సమాచారం. కాగా, తాజా విడతలో 9,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా ఎక్స్‌బాక్స్ విభాగంపై ఈ కోత ప్రభావం ఎక్కువగా కనిపించింది.

వివరాలు 

ఉద్యోగులు ఏఐ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటున్నారో కూడా పరిగణనలోకి తీసుకోవాలి 

మైక్రోసాఫ్ట్ డెవలపర్ డివిజన్ ప్రెసిడెంట్ జూలియా లూయిసన్ ఇటీవల తమ మేనేజర్లకు కీలకమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఉద్యోగుల పనితీరు అంచనా వేసే సమయంలో వారు ఏఐ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటున్నారో కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు, సంస్థ ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిల్ సందేశాల్లో "కృత్రిమ మేధ వినియోగం ఏమాత్రం ఆప్షన్‌ కాదని.. ప్రతి స్థాయిలో.. ప్రతి ఉద్యోగికి అత్యంత ముఖ్యమైంది" అని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగుల పనితీరు కొలమానంలో ఏఐ వినియోగాన్ని భాగంగా చేసేందుకు మైక్రోసాఫ్ట్ పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నాటికి దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రమాణాలను సంస్థ రూపొందించనున్నట్టు సమాచారం.

వివరాలు 

ప్రధానంగా సేల్స్ విభాగంలో ఉద్యోగాల కోతలు

ఈసారి ఉద్యోగాల కోతలు ప్రధానంగా సేల్స్ విభాగంలోని ఉద్యోగులను ఎక్కువగా ప్రభావితం చేశాయి. ఈ ఉద్యోగుల స్థానంలో కంపెనీ కస్టమర్లకు ఏఐ టూల్స్‌ను మరింత సమర్థంగా వివరించగల టెక్నికల్ సొల్యూషన్ ఇంజినీర్లను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ దిశగా మైక్రోసాఫ్ట్ సేల్స్ విభాగానికి చెందిన చీఫ్ జడ్సన్ అల్తోఫ్ ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్టు తెలిసింది.