
Microsoft : మరో 300మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసిన మైక్రోసాఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సాంకేతిక సంస్థ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను కొనసాగించింది. ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల నుండి తొలగించిన ఈ సంస్థ, తాజాగా మరొకసారి 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన చెప్పింది. సంస్థ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని విస్తృతంగా పెంచే ఉద్దేశంతో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాల ఫలితంగా ఈ ఉద్యోగాల కోత చోటుచేసుకున్నట్టు సమాచారం. ఈ అంశాన్ని బ్లూమ్‌బర్గ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. కృత్రిమ మేధ,ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతికతల వైపు దృష్టిసారిస్తున్న మైక్రోసాఫ్ట్, ఈ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గత నెలలో సంస్థ దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించింది.
వివరాలు
తొలగింపుల్లో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు
తొలగింపుల్లో ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఉండటం గమనార్హం. వీరిలో ప్రధానంగా ఏఐ వ్యవస్థల అభివృద్ధిపై పని చేసే సిబ్బంది ఉన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ప్రకారం, మార్కెట్‌లో పోటీలో ముందంజలో ఉండేందుకు అవసరమైన సంస్థాగత మార్పులను అమలుచేస్తూ తమ వ్యాపార లక్ష్యాలను సమీక్షిస్తున్నామని తెలిపారు. ఏఐ రంగంలో వేగంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, సంస్థ తన వ్యాపార ప్రాధాన్యతలను పునఃసమీక్షించి ఈ లేఅఫ్ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే, ఈ తాజా 300 మందిలో ఏ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని తొలగించారన్న దానిపై మైక్రోసాఫ్ట్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
వివరాలు
ఏఐ టెక్నాలజీల ద్వారా తక్కువ సిబ్బందితో ఎక్కువ పని
ఇటీవలి కాలంలో మైక్రోసాఫ్ట్‌తోపాటు మెటా,సేల్స్‌ఫోర్స్ వంటి టెక్ దిగ్గజ సంస్థలు కూడా మెషిన్ లెర్నింగ్,ఆటోమేషన్ వలె తక్కువ మానవ వనరులతో ఎక్కువ పనిని పూర్తి చేసే విధానాల వైపు దృష్టిసారిస్తున్నాయి. ఈ సంస్థలు ఏఐ ఆధారిత సాధనాల వినియోగాన్ని పెంచుతూ,నిర్వహణ వ్యయాలను తగ్గించడమే కాకుండా, ఇంజినీరింగ్ బృందాలపై ఆధారపడే పరిమాణాన్ని కూడా క్రమంగా తగ్గిస్తున్నాయి. సేల్స్‌ఫోర్స్ సంస్థ ఇటీవల వెల్లడించిన ప్రకారం,తమ సంస్థ ఏఐ టెక్నాలజీల ద్వారా తక్కువ సిబ్బందితో ఎక్కువ పనిని నిర్వహించగలగుతున్నదని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ కూడా తన కోడింగ్ ప్రక్రియలు, ఇతర సాంకేతిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి "ఏఐ కోపైలట్" అనే సాధనాలను వినియోగిస్తోంది. దీనివల్ల సాంకేతిక విభాగాల్లో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగుల అవసరం తగ్గుతోంది.