Microsoft: కోడ్ రెడ్ ప్రకటించిన మైక్రోసాఫ్ట్.. సేవల్లో సమస్యల పరిష్కారానికి కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) అంతర్గతంగా అత్యంత కీలకమైన 'కోడ్ రెడ్' (Code Red)ను ప్రకటించింది. ఇటీవల తమ సేవల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలతో ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్లు, ఆన్‌లైన్ సేవల్లో ఉన్న లోపాలను గుర్తించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12, 13 తేదీల్లో మైక్రోసాఫ్ట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా అవుట్‌లుక్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, కోపైలట్ వంటి సేవలను వినియోగించడంలో సమస్యలు తలెత్తాయి. జులైలో ప్రవేశపెట్టిన ఓ సాఫ్ట్‌వేర్‌లోని లోపమే ఈ అంతరాయానికి కారణమని సంస్థ గుర్తించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ లోపాన్ని దాదాపు నాలుగు నెలలపాటు గుర్తించలేకపోయినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.
వివరాలు
నెలకు సగటున కేవలం 44 నిమిషాలపాటు సేవల్లో అంతరాయం
అయితే, ఈ సమస్య వెనుక హ్యాకింగ్ లేదా ఏఐ ఏజెంట్ల దాడి లేదని అప్పట్లోనే స్పష్టం చేసింది.
సాధారణంగా మైక్రోసాఫ్ట్ తన 365 సేవలు 99.9 శాతం సమయం అందుబాటులో ఉంటాయని హామీ ఇస్తుంది.
అంటే నెలకు సగటున కేవలం 44 నిమిషాలపాటు మాత్రమే సేవల్లో అంతరాయం ఉండే అవకాశం ఉంటుంది.
కానీ, ఇటీవల ఎదురైన సమస్యల కారణంగా దాదాపు 24 గంటలపాటు సేవలు నిలిచిపోయాయి. ఇది సాధారణంగా మూడేళ్ల వ్యవధిలో ఉండే మొత్తం డౌన్‌టైమ్‌కు సమానమని అంచనా.
వివరాలు
భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లోని వినియోగదారులు ఇబ్బందులు
సమస్యను పరిష్కరించే క్రమంలోనూ పలు ఇబ్బందులు ఎదురైనట్లు సంస్థ గుర్తించింది.
రెస్పాండర్లు 11 బృందాల మధ్య మొత్తం 11 వేల సందేశాలను పంపినప్పటికీ.. వారికి అవసరమైన సమాచారం, డేటా సకాలంలో అందలేదు. దీంతో సమస్యను గుర్తించి పరిష్కరించే ప్రక్రియ మరింత ఆలస్యమైంది.
ఈ అంతరాయం కారణంగా భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 74 దేశాల్లోని వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అంతేకాకుండా, సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌లు ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు చేరడానికి కూడా ఎక్కువ సమయం పడుతున్నట్లు సంస్థ గుర్తించింది.
వివరాలు
ఉద్యోగులకు 'సిల్వర్ మెమో'
ఈ పరిణామాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తన సేవల్లో తలెత్తే సాంకేతిక సమస్యలను వీలైనంత త్వరగా, గంటలోపే పరిష్కరించే లక్ష్యంతో కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా ఉద్యోగులకు 'సిల్వర్ మెమో' పంపింది.
తాజాగా ప్రకటించిన కోడ్ రెడ్‌లో భాగంగా సమస్యల పరిష్కారం కోసం ఐదు రకాల కార్యాచరణ ప్రణాళికలను వెల్లడించింది.
సాఫ్ట్‌వేర్ లోపాలను ముందుగానే గుర్తించడం, సమస్యల పరిష్కార వేగాన్ని పెంచడం, సేవల అంతరాయాన్ని తగ్గించడం వంటి అంశాలపై సంస్థ ప్రత్యేక దృష్టి పెట్టనుంది.