నాల్గవ త్రైమాసికంలో 12% తగ్గిన మైక్రో సాఫ్ట్ లాభం, ఆర్ధిక అనిశ్చితే కారణం
మైక్రోసాఫ్ట్ 2022 చివరి మూడు నెలల ఆదాయాల నివేదికను ప్రకటించింది. ఈ త్రైమాసిక ఆదాయం గత 6 సంవత్సరాల కాలంలో అత్యల్ప వృద్ధిని నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆర్థిక అనిశ్చితి కారణంగా ఖర్చులను తగ్గించడానికి భారీగా ఉద్యోగులను తొలగించింది. మైక్రోసాఫ్ట్ ప్రస్తుత త్రైమాసిక ఆదాయం ప్రపంచ ఆర్థిక వాస్తవికతకు అద్దం పడుతుంది. మాంద్యం భయాలు పెద్దగా పెరగడం వలన, ఇటువంటి కంపెనీలు అందించే సేవలకు డిమాండ్ తగ్గుతోంది. కంపెనీ శాశ్వత క్లౌడ్ సర్వీస్ వ్యాపారం కూడా మందగిస్తోంది. గత త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ $52.7 బిలియన్ల ఆదాయాన్ని ప్రకటించింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 2% పెరిగింది. సంవత్సరానికి నికర ఆదాయం 12% తగ్గి $16.4 బిలియన్లకు చేరుకుంది.
క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు డిమాండ్ తగ్గడం వలన మైక్రోసాఫ్ట్ ఆదాయం తగ్గుదల
గత త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ వ్యాపారం 18% పెరిగి $21.51 బిలియన్లకు చేరుకుంది. కంపెనీ క్లౌడ్ వ్యాపారంలో భాగమైన అజూర్ క్లౌడ్ సర్వీసెస్ 31% వృద్ధి చెందింది. మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అమ్మకాలు కూడా 29% తగ్గాయి. వీడియో గేమ్‌లు, Xbox ద్వారా వచ్చే ఆదాయాలు త్రైమాసికంలో 12% పడిపోయాయి. ఈ త్రైమాసికంలో ఆదాయం తగ్గుతుందని మైక్రోసాఫ్ట్ ముందే అంచనా వేసింది. క్లౌడ్ విభాగంలో గత త్రైమాసికంలో వృద్ధి నమోదైనప్పటికీ, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు డిమాండ్ తగ్గడం వల్ల ఇలా అయిందని తెలిపింది. కంపెనీ మొత్తం ఆదాయం ఈ త్రైమాసికంలో $51 బిలియన్లుగా ఉంటుందని అంచనా వేస్తోంది, ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 3% ఎక్కువ.