
Microsoft: ఏఐతో రూ.4,000 కోట్లు ఆదా.. ఉద్యోగాల కోతల తర్వాత మైక్రోసాఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన మైక్రోసాఫ్ట్ ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగాల తొలగింపులు చేపట్టిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా సుమారు 9,000 మంది ఉద్యోగులకు సంస్థ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తమ కార్యకలాపాల్లో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని విస్తృతంగా పెంచుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తాజా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. మైక్రోసాఫ్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జడ్సన్ ఆల్తోఫ్ చేసిన ప్రకటన ప్రకారం, సంస్థ తమ కాల్ సెంటర్ కార్యకలాపాల్లో ఏఐ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించడం వల్ల ఒక్క ఏడాదిలోనే 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,285 కోట్లు) ఆదా చేసిందని తెలిపారు.
వివరాలు
మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4శాతం మంది అంటే సుమారు 9,100 మందికి నోటీసులు
ఇది కేవలం ఆర్థిక లాభాన్ని మాత్రమే కాకుండా, సంస్థ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించేందుకు దోహదపడిందని వివరించారు. సేల్స్, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి,కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఏఐ వినియోగం వల్ల వచ్చిన ప్రయోజనాలను ఈ సందర్భంగా చెప్పారు. ఇక సంస్థ ఇటీవల తీసుకున్న ఉద్యోగాల తొలగింపు నిర్ణయాలు భారీ స్ధాయిలోనే ఉన్నాయని చెప్పాలి. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 4శాతం మంది అంటే సుమారు 9,100 మందికి నోటీసులు ఇచ్చినట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ తొలగింపులు ప్రధానంగా ఎక్స్‌బాక్స్,గేమింగ్ విభాగాల్లో అమలు చేశారని సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో సంస్థ తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టగా, ఇది ఇప్పటివరకు నాలుగోసారి.
వివరాలు
జూన్‌లోనూ 300 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది
జనవరిలో మొత్తం ఉద్యోగుల్లో ఒక శాతం మందిని తొలగించిన సంస్థ, మే నెలలో మరోసారి 6,000 మందిని తొలగించింది. జూన్‌లోనూ 300 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగాలు కోల్పోయినవారిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డెవలపర్‌లు ఉన్నారు. ఈ చర్యలన్నీ సంస్థలో జరుగుతున్న మౌలిక పునరుద్ధరణ (రీస్ట్రక్చరింగ్)లో భాగంగానే తీసుకున్న నిర్ణయాలని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఉద్యోగాలు కోల్పోయినవారికి మైక్రోసాఫ్ట్‌లోని ఒక ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన సూచనలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
వివరాలు
మీ రెజ్యూమేను మెరుగ్గా రూపొందించేందుకు సహాయపడతాయి
''ఇది చాల కఠినమైన సమయం. ఈ లేఆఫ్‌లను మీరు ఎదుర్కోవాలన్నా, దాని ప్రభావం నుంచి బయటపడి ముందుకు సాగాలన్నా మీరు ఒంటరిగా లేరు అన్న విషయం మర్చిపోవద్దు. ఏఐ టూల్స్‌ను వినియోగించుకుంటూ, మీరు కెరీర్‌లో మరింత స్పష్టతతో ముందుకు వెళ్లొచ్చు. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, మీ రెజ్యూమేను మెరుగ్గా రూపొందించేందుకు సహాయపడతాయి'' అని ఎక్స్‌బాక్స్ గేమ్ స్టూడియోస్‌లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మ్యాట్ టర్నబుల్ తన లింక్డ్ఇన్ ఖాతాలో చేసిన పోస్టు చేశారు. అయితే, ఉద్యోగాలు కోల్పోయిన క్షణంలో ఇటువంటి సలహాలు ఇవ్వడం సరిగ్గా లేదని పలువురు నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు.