Page Loader
Microsoft: మరో రౌండ్‌ లేఆఫ్స్‌కు సిద్ధమైన మైక్రోసాఫ్ట్‌.. వేలాది మందిపై ప్రభావం..!
మరో రౌండ్‌ లేఆఫ్స్‌కు సిద్ధమైన మైక్రోసాఫ్ట్‌.. వేలాది మందిపై ప్రభావం..!

Microsoft: మరో రౌండ్‌ లేఆఫ్స్‌కు సిద్ధమైన మైక్రోసాఫ్ట్‌.. వేలాది మందిపై ప్రభావం..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2025
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్‌ రంగంలో ఆర్థిక స్థిరత కొరత, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరగడం వంటి అంశాల ప్రభావంతో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇప్పటికే శతాధికుల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. 2025లో ఇప్పటివరకు 130 టెక్నాలజీ కంపెనీలు కలిపి దాదాపు 61,000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయన్నది గణాంకాల ద్వారా వెల్లడైంది. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం,మరో విడత లేఆఫ్స్‌కు మైక్రోసాఫ్ట్‌ సిద్ధమవుతోందని తెలుస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరాంతం దశకు చేరుతున్న ఈ సమయంలో కంపెనీ తిరిగి ఉద్యోగులపై వేటు వేయనుందన్న వార్త బ్లూమ్‌బర్గ్‌ నివేదికలో వెల్లడైంది.

వివరాలు 

2025 మే నెల మధ్యలో 6,000 మంది తొలగింపు 

సంస్థ నిర్మాణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొనబడింది. తాజా విడత లేఆఫ్స్‌ ముఖ్యంగా విక్రయాల (సేల్స్‌) విభాగంలోనే ఉండబోతున్నట్లు సంస్థతో సంబంధం ఉన్న వర్గాల వ్యాఖ్యనాల ద్వారా తెలుస్తోంది. అయితే, దీనిపై మైక్రోసాఫ్ట్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలోనూ మైక్రోసాఫ్ట్‌ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించిన ఉదాహరణలు ఉన్నాయి. 2025 మే నెల మధ్యలో సంస్థ దాదాపు 6,000 మందిని తొలగించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో సుమారు మూడు శాతం. 2023లో కంపెనీ 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించగా, తాజా తొలగింపులు ఆ తరువాత రెండవ అతిపెద్ద రౌండ్‌ కావడం గమనార్హం.

వివరాలు 

2025 జనవరిలో కొంతమంది ఉద్యోగుల తొలగింపు 

సంస్థ ప్రతినిధుల ప్రకారం, మేనేజ్‌మెంట్‌ స్థాయిలను సర్దుబాటు చేయడం, కార్యకలాపాల్లో సమర్ధత పెంచడం వంటి లక్ష్యాలతో ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొనబడింది. 2025 జనవరిలో కూడా పనితీరు ఆధారంగా కొంతమంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అలాగే, ఈ నెల ప్రారంభంలోనూ మరికొంతమందిపై వేటు పడింది. మైక్రోసాఫ్ట్‌ ప్రకారం,మార్కెట్‌లో ఉత్కంఠభరితమైన పోటీకి తగినదిగా సంస్థను మళ్లీ తీర్చిదిద్దే ప్రాసెస్‌లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని స్పష్టం చేసింది. "మా సంస్థ వ్యూహాలను మరింత శక్తివంతంగా మార్చేందుకు అవసరమైన అంతర్గత మార్పులను అమలు చేస్తున్నాం. తద్వారా మార్కెట్‌ పోటీలో పైచేయి సాధించగలగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని మైక్రోసాఫ్ట్‌ స్పష్టం చేసింది.