
Tech Layoffs: భారీ లేఆఫ్స్ దిశగా మైక్రోసాఫ్ట్ అడుగులు.. దాదాపు 6 వేల మంది తొలగింపుకు ప్రణాళిక సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
కరోనా మహమ్మారి ఉధృతికి తలొగ్గిన రంగాల్లో ఐటీ,టెక్ పరిశ్రమలు ఉన్నాయి.
కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, ఖర్చుల నియంత్రణ తగ్గించుకోవడం కోసం సంస్థలు ఉద్యోగుల తొలగింపులు చేపట్టాయి.
ఈ పరిస్థితి రెండు నుండి మూడు సంవత్సరాలపాటు కొనసాగింది. ఈ కాలంలో జరిగిన విస్తృత స్థాయి లేఆఫ్స్ వల్ల లక్షల మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.
ప్రపంచంలోని అగ్రగామి టెక్నాలజీ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్ కూడా ఇప్పుడు వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.
తాజా నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులలో సుమారు 3 శాతం మందిని లేఆఫ్ చేయనున్నట్లు సమాచారం.
అంటే, ఈ కోత వల్ల వేలాది మంది ఉద్యోగులపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.
వివరాలు
మైక్రోసాఫ్ట్‌లో రెండోసారి భారీ ఉద్యోగాల కోత
2023లో మైక్రోసాఫ్ట్ దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మళ్లీ ఇలాంటి స్థాయిలో ఉద్యోగాలను తొలగించేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
గత ఏడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ మరియు దాని అనుబంధ సంస్థలలో మొత్తం 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
ఇప్పుడు అందులో 3 శాతం అంటే సుమారు 6 వేల మందిని తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మార్కెట్లో పోటీతత్వాన్ని మెరుగుపరచడానికి, సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తెలిపారు.
మేనేజ్‌మెంట్ లెవెల్స్‌ను తగ్గించడం,కార్యకలాపాల్లో సరళత తేవడమే ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
ఈ నిర్ణయంతో మధ్యస్థాయి మేనేజ్‌మెంట్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి.
వివరాలు
ఇది పనితీరు ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం
గత జనవరిలో మైక్రోసాఫ్ట్ కొన్ని ఉద్యోగులను వారి పనితీరు ఆధారంగా తొలగించింది.
కానీ ఇప్పటి లేఆఫ్స్ విషయంలో మాత్రం, ఉద్యోగుల పనితీరుతో ఎలాంటి సంబంధం లేదని కంపెనీ వర్గాలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.