Page Loader
Nandini Milk : పాల ధరలు పెరుగనున్నాయ్.. వినియోగదారులకు కేఎమ్‌ఎఫ్‌ షాక్!
పాల ధరలు పెరుగనున్నాయ్.. వినియోగదారులకు కేఎమ్‌ఎఫ్‌ షాక్!

Nandini Milk : పాల ధరలు పెరుగనున్నాయ్.. వినియోగదారులకు కేఎమ్‌ఎఫ్‌ షాక్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2025
01:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. లీటరుకు ఏకంగా రూ.5 పెంచేలా ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు మార్చి 7న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం లభిస్తే, కొత్త ధరలు వెంటనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. పాల ధర పెంపుతో పాటు పరిమాణం కూడా తగ్గించేలా కేఎమ్‌ఎఫ్‌ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రతి పాల ప్యాకెట్‌లో 50 మిల్లీలీటర్ల అదనపు పాలను వినియోగదారులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. అంటే, లీటరు ప్యాకెట్ 1,050 మిల్లీలీటర్లుగా ఉంది. అయితే తాజా ప్రతిపాదన ప్రకారం, దీనిని 1,000 మిల్లీలీటర్లకు కుదించనున్నారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే, లీటరు నందిని టోన్డ్‌ మిల్క్‌ ధర రూ.47కు పెరగనుంది.

Details

ఒక్కసారిగా రూ.5 పెంపు

గతంలోనూ కేఎమ్‌ఎఫ్‌ పాల ధరలను క్రమంగా పెంచుతూ వచ్చింది. చివరిసారిగా జూన్‌ 2024లో లీటరుకు రూ.2 పెంచగా, అంతకుముందు జులై 2023లో రూ.3 పెంచింది. ఇప్పుడు ఒక్కసారిగా రూ.5 పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమవ్వడం గమనార్హం. ఇంతలోనే కర్ణాటక ప్రజలకు నిత్యావసర ధరల పెరుగుదలతో మరో భారంగా మారనుంది. ఇటీవల కాఫీ బ్రూవర్ల సంఘం కాఫీ పౌడర్‌ ధరలను కిలోకు రూ.200 పెంచనున్నట్లు ప్రకటించింది. BMTC బస్సులు, నమ్మ మెట్రో ఛార్జీలు కూడా పెరిగాయి. ప్రభుత్వం నీటి సుంకం పెంచేందుకు పరిశీలనలో ఉండగా, విద్యుత్ సరఫరా కంపెనీలు యూనిట్‌కు 67 పైసలు పెంచడానికి కర్ణాటక విద్యుత్ కమిషన్ అనుమతి కోరాయి. ఇలా అన్నీ ధరలు పెరుగుతుండటంతో ప్రజలపై భారం మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.