Stock Market: స్టాక్ మార్కెట్ ద్వారా లక్ష కోట్ల డాలర్ల సంపద.. నివేదికిచ్చిన మోర్గాన్ స్టాన్లీ
గత పదేళ్లలో భారతీయులు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా లక్ష కోట్ల డాలర్ల లాభాలు ఆర్జించారు. మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక ప్రకారం, ఇది వారి సంపాదనలో కేవలం 3 శాతం పెట్టుబడిగా పెట్టడం ద్వారా సాధ్యమైందని పేర్కొంది. గత దశాబ్ద కాలంలో భారత కుటుంబాలు తమ సంపదను 8.5 లక్షల కోట్ల డాలర్లకు పెంచుకోవడం విశేషం. ఇందులో 11% లాభాలు ఈక్విటీల నుంచి వచ్చాయి. కంపెనీల వాటాదారుల సంపదను కలిపితే మొత్తం సంపద 9.7 లక్షల కోట్ల డాలర్లకు, ఈక్విటీ లాభాలు 20% పెరుగుతూ 2 లక్షల కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.
ఈక్విటీ పెట్టుబడులతో భారీ లాభాలు
ఈక్విటీల్లో భారత కుటుంబాల పెట్టుబడులు ఇప్పటికీ తక్కువ స్థాయిలో ఉన్నాయని మోర్గాన్ స్టాన్లీ నివేదిక వెల్లడించింది. అయితే రాబోయే దశాబ్దాల్లో ఈక్విటీల్లో పెట్టుబడులు రెండంకెలకు చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 2014లో 1.2 లక్షల కోట్ల డాలర్లు ఉండగా, 2024 నాటికి ఇది 5.4 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. భారత స్టాక్ మార్కెట్ స్థిరమైన వృద్ధి దశలో ఉందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. భారతీయ కుటుంబాలు మరింతగా ఈక్విటీల్లో పెట్టుబడులు పెంచితే, సంపద సృష్టి మరింత వేగవంతమవుతుందని 'మోర్గాన్ స్టాన్లీ' అంచనా వేస్తోంది.