LOADING...
Fasal Bima Yojana: రైతులకు శుభవార్త.. 30 లక్షల మందికి నేడు ఫసల్ బీమా నిధులు విడుదల
రైతులకు శుభవార్త.. 30 లక్షల మందికి నేడు ఫసల్ బీమా నిధులు విడుదల

Fasal Bima Yojana: రైతులకు శుభవార్త.. 30 లక్షల మందికి నేడు ఫసల్ బీమా నిధులు విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2025
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

సోమవారం దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి ఫసల్‌ బీమా యోజన కింద నిధులు చేరనున్నాయి. ఈసారి మొత్తం రూ.3,200 కోట్లు 30 లక్షల మంది రైతులకు జమ అవుతాయి. రాజస్థాన్‌లోని జుంజునులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు. ఈ పథకంలో అతిపెద్ద లబ్ధిదారులు మధ్యప్రదేశ్‌ రైతులే. వారికీ రూ.1,156 కోట్లు రానున్నాయి. రాజస్థాన్‌ రైతులకు రూ.1,121 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌ రైతులకు రూ.150 కోట్ల నిధులు చేరతాయి. మిగతా రాష్ట్రాల రైతులకు కలిపి రూ.773 కోట్లు జమ కానున్నాయి.

వివరాలు 

ఫసల్ బీమా ప్రత్యేకతలు 

2016లో కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఫసల్‌ బీమా యోజనను ప్రారంభించింది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు వంటి కారణాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులను ఆదుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. ఖరీఫ్‌ పంటలకు కేవలం 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య పంటలకు 5% మాత్రమే. మిగతా ప్రీమియం మొత్తాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా భరిస్తాయి. దీని వల్ల రైతులపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది.

వివరాలు 

బీమా ఎప్పుడు వర్తిస్తుంది? 

వర్షాభావం, వరదలు, తుఫానులు, కరువు, తెగుళ్లు వంటి కారణాలతో పంటలు నష్టపోయినప్పుడు ఈ బీమా వర్తిస్తుంది. అంతేకాదు, పంట కోయగానే పొలంలో ఆరబెడుతున్న సమయంలో జరిగిన నష్టానికి కూడా ఈ పథకం రక్షణ ఇస్తుంది. అధికారులు నష్టాన్ని అంచనా వేసి, 15 రోజులలోపే క్లెయిమ్‌ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

వివరాలు 

తెలుగు రాష్ట్రాల్లో అమలు 

మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పథకం ద్వారా రైతులు పెద్దఎత్తున లాభపడుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో బీమా పొందేందుకు ఆగస్టు 15 వరకు గడువు ఉంది. రైతులు కేవలం రూ.76 ప్రీమియం చెల్లిస్తే, రూ.38 వేల వరకు బీమా రక్షణ పొందవచ్చు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమ పంటలకు రక్షణ కవచాన్ని కల్పించుకుంటున్నారు. అధికారులు రైతులందరూ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.