LOADING...
Californium: బంగారానికే మించిన విలువ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెటల్ ఇదే!
బంగారానికే మించిన విలువ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెటల్ ఇదే!

Californium: బంగారానికే మించిన విలువ.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెటల్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2026
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం అత్యంత విలువైన లోహమనే భావన మనకు తెలిసిందే. ఇటీవలి కాలంలో పసిడి ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయి. బంగారాన్ని ఆభరణాలుగా ధరించడం, బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేసి భద్రపరచడం, తాజాగా డిజిటల్ గోల్డ్‌గా ఇన్వెస్ట్ చేయడం వంటి మార్గాల్లో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇంత విలువైన బంగారాన్ని మించిన ధర కలిగిన మరో లోహం ఉందంటే ఆశ్చర్యమే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెటల్‌గా గుర్తింపు పొందిన ఒక మూలకం ఉంది. ఆలోహాన్ని కేవలం ఒక గ్రాము అమ్మితే చాలు దాదాపు 200కిలోల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఆ అరుదైన లోహమే కాలిఫోర్నియం. మరి కాలిఫోర్నియం ఎందుకు అంత ఖరీదైనది? అది ఎక్కడ లభిస్తుంది? దేనికి ఉపయోగిస్తారు? పూర్తి వివరాలు ఇవి.

Details

దీని రసాయన సంకేతం Cf

కాలిఫోర్నియం (Californium) అనేది అత్యంత అరుదైన, రేడియోఆక్టివ్ రసాయన మూలకం. దీని రసాయన సంకేతం Cf కాగా, పరమాణు సంఖ్య 98. ఇది ఆక్టినైడ్ శ్రేణికి చెందిన ట్రాన్స్‌యురేనియం మూలకం, అంటే యురేనియం కంటే ఎక్కువ పరమాణు సంఖ్య కలిగిన మూలకం. 1950లో అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బెర్క్లీ)లో స్టాన్లీ థాంప్సన్, గ్లెన్ సీబోర్గ్, అల్బర్ట్ గియోర్సో, కెన్నెత్ స్ట్రీట్ వంటి శాస్త్రవేత్తలు క్యూరియం-242పై ఆల్ఫా కణాలు (హీలియం అయాన్లు) ప్రయోగించి ఈ మూలకాన్ని సృష్టించారు.

Details

'కాలిఫోర్నియం'గా నామకరణం

ఈ మూలకం ఆవిష్కరణ జరిగిన విశ్వవిద్యాలయం పేరు ఆధారంగా దీనికి 'కాలిఫోర్నియం' అనే పేరు పెట్టారు. ఇది పూర్తిగా ప్రయోగశాలల్లో మానవుల చేత సృష్టించబడిన మూలకం. సహజంగా ఇది ఎక్కడా లభించదు. సహజ వనరులలో దొరకకపోవడం, అత్యంత అరుదుగా ఉండటం, ఉత్పత్తి ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండటమే దీనిని అత్యంత ఖరీదైన లోహంగా మారుస్తున్న ప్రధాన కారణాలు. ధర విషయానికి వస్తే, కాలిఫోర్నియం ఒక గ్రాము ధర సుమారు 27మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడుతోంది. ఇది దాదాపు 200 కిలోల బంగారం విలువకు సమానం. మరోవైపు ప్రస్తుతం బంగారం ధర కిలోగ్రామ్‌కు సుమారు రూ.13మిలియన్లుగా ఉంది. ఈ లెక్కన కేవలం ఒక గ్రాము కాలిఫోర్నియం అమ్మితే దాదాపు 200కిలోగ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Details

 ముఖ్యమైన రంగాల్లోనే వీటిని వినియోగిస్తారు

ఇంత ఖరీదైన కాలిఫోర్నియాన్ని ముఖ్యమైన రంగాల్లోనే వినియోగిస్తారు. అణు రియాక్టర్లను ప్రారంభించడానికి ఇది ఉపయోగపడుతుంది. బంగారం, వెండి వంటి ఖనిజాలను గుర్తించేందుకు న్యూట్రాన్ యాక్టివేషన్ అనాలిసిస్‌లో దీనిని వినియోగిస్తారు. అలాగే నూనె బావుల్లో నీరు, నూనె పొరలను గుర్తించేందుకు న్యూట్రాన్ మాయిశ్చర్ గేజ్‌లలో ఉపయోగిస్తారు. విమానాల్లో ఉపయోగించే లోహాల్లో ఒత్తిడి, ఫాటీగ్‌ను గుర్తించేందుకు కూడా కాలిఫోర్నియం ఉపయోగకరంగా ఉంటుంది. క్యాన్సర్ చికిత్సలో, ముఖ్యంగా సర్వికల్ క్యాన్సర్‌కు సంబంధించిన Cf-252 న్యూట్రాన్ థెరపీ పరిశోధనల్లో దీనికి ప్రాధాన్యం ఉంది. అదేవిధంగా న్యూట్రాన్ డిఫ్రాక్షన్, స్పెక్ట్రోస్కోపీ వంటి మెటీరియల్ స్టడీస్‌లో కూడా కాలిఫోర్నియాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ కారణాల వల్లే బంగారాన్ని మించిన విలువ కలిగిన లోహంగా కాలిఫోర్నియం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

Advertisement